పుట:Telugu merugulu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

తెలుగుమెఱుంగులు

150 పోజ్మయాకృతిఁ దాల్చును. పదనాఱువన్న బంగారమును మించినమేనిసారు గల శుద్ధ సాత్త్వికతేజోవిరాజితునకు బంగారపుటలంకారములతో బనియేమి?

శాస్త్రకారుల శారీరకపదార్థ విజ్ఞానరసాయనాది శాస్త్ర ప్రజా తిశయమున గులాబీ పువ్వును సువాసనతో, సౌకుమార్యముతో, పూవు తేనెలో, పుప్పొడితో సర్వసులభముగా శాస్త్ర ప్రక్రియ చొప్పునఁ గల్పింపం గల్గినపుడు గులాబిచిత్రకల్పన ప్రయోజనము సమసిపోవును. శాస్త్రజ్ఞులు శబ్దస్పర్శరూపరసగంధములను జ్ఞానేంద్రియ వ్యాపారములతో నిప్పటికి శబ్దరూపములను సర్వత్ర సర్వదా సులభములు చేయఁగల్గినట్లు తక్కిన మూడింటినిగూడ చేయఁగల్గ వచ్చును. అనఁగా మదరాసురేడియోలో పాడఁగా నపుడే గ్రామఫోనులో నెక్కించిన పాట, యెక్కడఁబట్టిన సక్కడ, ఎప్పుడు పట్టిన సప్పుడు వినఁదగినట్లు, చెన్నపురిలోనే రేడియోస్థానమునఁ బెట్టిన భక్ష్యభోజ్యముల చవియు, పూల వాసనయు, వస్తువుల స్పర్శయు సదా సర్వత్ర యాస్వాదింపఁ దగినది, యాఘ్రాణింపఁ దగినది, స్పృశింపఁ దగినది కావచ్చును గదా!

ఇట్టివి జరిగినచో ఇంక ననుకరణములయు. ప్రతికృతి కల్పనములయు. కవితాకల్పనములయు ప్రయోజన మేముండును? సత్యజగదానందమే కాని కవికల్పిత జగదానంద మప్పు డక్కలు లేక పోవును, కవి యపుడు దన కనుకార్యుఁడగు నీశ్వరునికిఁ దాను బ్రతిబింబతను గాక తాదాత్మ్యమునే పొందును. ఇట్లు మానవతలో నీశ్వరతాదాత్మ్యము గోచరింపను గోచరింపను వాజ్మయముకూడ నకృత్రిమ మయి తాత్త్విక మగును. ఆత్వీకులయు, సాత్త్వికులయు దివ్యవిజ్ఞానము లిందుకు తార్కాణము. “తత్త్వమసి" యిందుకు ప్రమాణము.