పుట:Telugu merugulu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

తెలుఁగుమెఱుఁగులు


మగుట, చిత్రకారుఁడును దద్రచనాప్రణాళియు ప్రత్యక్ష మగుట యన్నగుణము లుండుటవలనను; అంతే కాక, మానవత ప్రాయికముగా మాయాజా సావృతమై సత్యానుభూతికి దూరమై తానే సత్య ప్రతిబింబభూతమై యుండుటవలనను, సులభమగు సత్యప్రతికృతికే మానవ ప్రకృతి ముచ్చటపడును.

సామాజికాభిరంజనమునకై కవియు తాను కల్పించిన సత్య ప్రకృతికి వస్వలంకారశిల్పము, భాషాపరివేషము శయ్యా వైయాత్యము ఛందస్సందర్భము పొసగించి స్వారస్యాతిశయము సంపాదింపఁ జూచును.

సృష్టివ్యాపార కార్యమును స్పష్టముగా, సర్వదృశ్యముగా సాగించుచుఁ గూడఁ దత్కర్త యీశ్వరుఁడు తన్ను దాచుకొని తన కార్యములచేతనే తన్ననుమానిపించు చున్నట్లు ఉత్తమకవియు సత్యప్రతికృతియగు తనకవితాకల్పనలోఁ దత్పరమార్థ మంతర్లీనమై వ్యక్తముగా ధ్వన్యర్థవేద్యము కాలేకపోయినచో నట్టికవి వట్టి యబద్ధాలకోరుగానే గర్షితుఁ డగును.

అనఁగా, కవిత యొకవిధముగా నసత్యకల్పనమే యైనను, కవితలో ననభివ్యక్తముగా సత్యానందము వ్యంజనావృత్తి గోచరమై సందర్భిత మయియుండఁబట్టియే యది హృద్య మగుచున్న దన్నమాట.

ఈశ్వరతత్త్వము అవాజ్మనసగోచర మగుట తథ్యము. అట్లయ్యు దాని నాకళించుటకై లోకమెల్ల నటతటపడుచుముందు కడుగువేయుచున్న దనుటయుఁ దథ్యము, అది యనివార్య మగుటయుఁ దథ్యము, మానవయత్నము లెల్ల సత్యార్థములు,జానార్థములు నానందార్థములు నగుటను బట్టియు, నీశ్వరుఁడు నిరతిశయసత్యజ్ఞానానందాత్మఁకుఁ డగుటను బట్టియు నిది యిట్లే యనవలెను. ఉపనిషత్తు “ అసతో మాస ర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యో ర్మామృతం గమయ” అని భగవత్రాప్తిని ప్రతిపాదించుచున్నది.