పుట:Telugu merugulu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

145


గూడ నిపుడు గానరాదు. ప్రాచీన లక్షణ గ్రంథకారులుగాని, యితర ప్రాచీనకవులు గాని యీ సత్యనారనను స్మరించినట్లు గానరాదు. ఎట్రాప్రెగ్గడ రామాయణము ఎర్రాప్రెగ్గడనాఁటనుండి కూచిమంచి తిమ్మకవినాఁటి దాఁక సుప్రచారము గలదిగాఁ దెలియవచ్చు చున్నది. నూటయెనుబది యేండ్ల క్రిందటిదాఁక సురక్షితమై యున్న యీ గ్రంథ మీనాఁడు గూడ నెక్కడనేని అపరిజ్ఞాతముగా నుండవచ్చును. గోదావరీమండలమున కందరాడ, చంద్రమపాలెముల (కూచిమంచి తిమ్మకవియూళ్లు) చుట్టుపట్టులఁ గాని , కృష్ణా గుంటూరు నెల్లూరు కడప కర్నూలు మండలములలోఁ గాని అది దొరకఁదగు ననుకొందును. నెల్లూరు కర్నూలు కడప మండలములలో ప్రాచీన గ్రంథపరిశీలన మింకను సరిగా జరుగవలసియున్నది. ఆయా చోట్ల నపరిచితముగా నున్న తాటియాకు కట్టలను పరిశీలించి ఎఱ్ఱ పెగ్గడరామాయణము నేపుణ్యాత్ముఁడేని యుద్ధరింపఁగల్గు నని విశ్వసించుచున్నాను. ఎట్రాప్రెగ్గడ నృసింహపురాణము తప్పులతో నొక్క ప్రతిమాత్రమే ప్రాచ్యలిఖిత పుస్తకశాలలోఁ గలదు. దానికిని మంచి ప్రత్యంతరము కావలెను. ఆంధ్రవిశ్వవిద్యాలయోపాధ్యక్షు లగు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు ఎర్రాప్రెగ్గడ రామాయణమును సంపాదింపఁ గల్గితిమేని యది మన కొక భాగ్యవిశేష మనియు, దాని నార్జింపఁగలవారి కెంత సాహాయ్యమేనీ చేయ నుత్సహింతు మనియు ఆనడుమ రాజమహేంద్రవరమున జరిగిన రెడ్డి సామ్రాజ్యవర్ధంత్యుత్సవమునం జెప్పిరి. శ్రీరామలింగారెడ్డిగారి పవిత్రాశయము సఫలమగుట కపేక్షించుచున్నాను.