పుట:Telugu merugulu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

తెలుగుమెఱుంగులు


అయోధ్యాకాండమునఁగూడ రచనాభేదములు చాలఁగాఁ గలవు. అందుఁగూడఁగొన్ని యెర్రాప్రెగ్గడపద్యము లుండునేమో! ఇట్లు భాస్కరరామాయణగ్రంథభాగము లెన్నోచిక్కులతో నున్నవి. అవియెల్ల జాగ్రత్తగాఁ బరిశీలించి యిదమిత్థమని నిర్ణయింపవలసియున్నది. భాస్కర రామాయణమున ఎర్రాప్రెగ్గడ రచనములు కొన్ని చేరియుండుట తథ్యము.

4 ఆ నడుము నేను ప్రాచ్య లిఖిత పుస్తకశాలలోని యొక సంకీర్ణ పద్యముల తాళపత్రసంపుటమును పరిశీలించుచుండఁగా అందు రామాయణ యుద్ధకాండమున పద్యములు ముప్పది కానవచ్చినవి. చదువఁగా నవి ప్రసిద్ధములైన భాస్కరరామాణణాది గ్రంథములలోనివిగా తోఁచలేదు. భాస్కరరామాయణమును, భారతారణ్యపర్వాంతర్గత రామాయణమును, భాగవతాంతర్గత రామాయణమను, మొల్లరామాయణమును, రామాభ్యదయ మును ఘనగిరి రామకవి సకలవర్ణనాపూర్ణరామాయణమును పరిశీలించి చూచితిని. ఆ కానవచ్చిన ముప్పది పద్యములు నందెందును గానరాలేదు. ఆ పద్యములుగూడ ఎర్రాప్రెగ్గేడ రామాయణములోనివి కావచ్చునను కొనుచున్నాను. వానిలో-


"నిను సేవించినఁగల్లు మానవులకున్ వీటీవధూటీఘటీ
ఘనకోటీ శకటీకటీతటి పటీగంధీభవాటిపటీ
రసటీహారిపటీ సువర్ణమకుటీ ప్రచ్చోటికాపేటికల్
కనదామ్నాయ మహాతురంగ శివలింగా నీలకంఠేశ్వరా!"!


ఈ 28 వ పద్యము నీలకంఠేశ్వరస్తుతిరూప మయినది. ఇది వేఱొక గ్రంథములోనిది యయినను గానవచ్చును. కానీ, యీ సంకీర్ణపద్య సంపుటమున సుదాహృతరామాయణపద్యములతో నున్నది. కాన రామాయణములోనిదియే కావచ్చు నసుట సంగత మగును. ఎర్రాప్రెగ్గడ నెల్లూరి మండలమందలి గుడ్లూరి నీలకంఠేశ్వరస్వామిభక్తుఁడు. ప్రోలయ