పుట:Telugu merugulu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుఁగులు

135


ఇటీవల భాస్కరరామాయణమును పరిశీలించుచుండఁగా వావిళ్ల వారిముద్రణమున యుద్ధకాండములోని యీ క్రింది పద్యము 'ఎఱా ప్రెగ్గడవారి పద్య మని ప్రతీతి' అను అధోజాపికతో కానవచ్చెను.


"ఉ.త్రెవ్వెదు గంటులం గురువు దేఱైడు నెత్తురు రాకమున్న యే
నొవ్వియు నేవికారము మనోగతిఁ జెందకమున్న సాయకం
బవ్వలఁబోకమున్న మకుటాగ్ర విఘట్టనరావ మొప్పుంగా
నువ్వున నుప్పతిల్లె నసురోద్వహ మూర్ధచయంబు గ్రక్కునన్. "


అది చూచి వ్రాతప్రతులను పరిశీలింతును గదా ఉదాహృతమైన యీ పద్యము ఎట్రాప్రెగ్గడ వారి దని యుండుట మాత్రమే కాక దీనిపూర్వ పద్యము--


"ఉన్నవి యున్నయట్ల తల లుర్వికి డిగె శిరఃప్రవాహముల్
మొన్నొక సారె నిండు దెగ మోపిన సాయక మట్లే యుండఁజాం
గె న్నెఱిఁడూపు వెల్లియని ఖేచరకోటి నుతించె నంచితో
త్పన్నదశాస్యరాఘవతపః కరలాఘవచిత్రసంపదల్."


అనుపద్యము 'భాస్కరుని వారి' దనికూడఁ గలదు. ఈ పద్యములు పెక్కుప్రతులలోఁగానరావు. కొనిప్రతులలోనే కలవు. ఇవి రాముఁడు రావణునితలలు తెగఁ గొట్టు ప్రకరణమునందలివి. యుద్ధకాండములోని యీ భాగమున భాస్కరరచనము నేఁడు కానరాదు. భాస్కరుఁడు కడముట్ట యుద్ధకాండము రచించినట్టు ప్రతీతియు లేదు. ఇందు భాస్కరరచనముగ పద్య ముందుటనుబట్టి చూడఁగా భాస్కరుడు యుద్ధ కాండమును కడముట్ట రచించె నని యేర్పడుచున్నది. ఇవే కాక, యుద్ధకాండమున మఱికొన్ని పద్యములు కొన్ని ప్రతులలో మాత్రమే యధికముగాఁ గానవచ్చుచున్నవి. దొరకిన యుద్ధకాండప్రతులనెల్ల పరిశీలించిన యెడల నట్టివి మఱికొన్ని పద్యములుగూడ భాస్కరునివిగనో, ఎట్రాప్రెగ్గడవిగనో వేర్పడఁగల పనుకొందును. యుద్ధకాండ విషయ మిట్టుండె.