పుట:Telugu merugulu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుంగుమెఱుంగులు

133


సంస్కృత భాషలో అకారము రెండు దెఱఁగులు గలది. 'అ ఆ' అను సూత్రమున పాణిన్యాచార్యులు సంవృతము వివృతము అని అకారము రెండు విధము లనియు, ప్రక్రియాదశలోని అకారము వివృత మనియు, ప్రయోగదశలోని అకారము సంవృత మనియుఁ జెప్పిరి. తెఱపినోటితో నుచ్చరించిన అకారము వివృతము. ఆంధ్రద్రవిడకర్ణాట దేశములందు అకారము ప్రయోగదశలోఁగూడ నిట్లు తెలిపి నోటితో వివృతముగానే ఉచ్చరింపఁబడుచున్నది. ఈ యుచ్చార మపొణినీయము. ఆంధ్ర ద్రవిడకర్ణాటభాషల సంప్రదాయము సంస్కృత ప్రాకృత భాషలసంప్రదాయము నకంటె వేరయిన దనుట కిదియు నొక సాధనము, ఓడ్రదేశము మొదలగు నుత్తరదేశములందు హ్రస్వాకారము సంవృతముగానే ఉచ్చరింపఁబడును వారు నోరిని గొంత ముడిచియే అ కారోచ్చారము జరుపుదురు. ఆ సంవృతోచ్చారము మనకు ఉ కారమునకు, ఒకారమునకు నడిమిదిగా వినవచ్చుచుండును.

సంస్కృత ప్రాకృతములు, తద్భవములునగు పదముల తుదిహ్రస్వా కారము ఇక్ష్వాకులు మొదలగు నౌత్తరాహరాజుల శాస్త్రీయ సంవృతో చ్చారణరీతి ననుకరించుటలోఁ దెలుఁగున కా రీతి యపరిచిత మగుటచే ఉత్వముగా మార్పు చెందినది. ఈ కారణముచేతనే విభక్తి 'oడు' కు పూర్వమున నున్న అకారమునకు ఉకారాదేశము వచ్చుట ప్రాయికముగా సంస్కృత ప్రాకృత సమభవ శబ్దములకే కొనవచ్చుచున్నది. దేశితెలుఁగు శబ్దముల కట్టులేదు. కొండఁడు, తిక్కఁడు, మారఁడు, రేచఁడు ఇత్యాదిశబ్దముల కుత్వము రాలేదు గదా? ఇవి ద్రావిడ భాషా కుటుంబ సంప్రదాయోచ్చారము గల శబ్దము లగుటచే వీనికి సంవృతోచ్చారము లేదయ్యెను. ఉకారాదేశము రా దయ్యెను.