పుట:Telugu merugulu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

తెలుఁగుమెఱుంగులు


గ్రహింపను నేరని) రాజులకు స్వరచితకృతులను (కృతికర్తృత్వ రూపముననో, కృతిపతిత్వరూపముననో) అంటఁగట్టి ( ఈలోకమున భోగభాగ్యములతో నందలా లంబారీలు నెక్కి యూరేఁగిన నేమి) పరలోకమున బాధలు పడుదురు" అని పెద్దన గారి కెదురుదెబ్బ కొట్టినాఁడు. ఇట్లు నిబ్బరించి చెప్పిన మొనగా డెవ్వఁ డనఁగా బైచరాజు వెంకటనాథకవిరాజు. ఈతని కృతి పంచతంత్రము. తెలుఁగున దేశిరచనాచమత్కారము గల గ్రంథ మీతని గ్రంథమును బోలునది వేఱొకటి గానరాదు. “ఈ రాచకవిత్వబాధ పడరాదు పరామరిసింపు దైవమా" యని 'శారద నీరూప' మనఁబడిన గడుసరీ కవిచేఁగూడఁ బిలికించినవాఁడు. ఈతఁడు తన కృతిని తిక్కన, నాచన సోమనలవలె హరిహరార్పణము చేసినాఁడు.

"ఏ చనవు గలదు హరిహర
సాచివ్యము నొంద నన్యజనులకు మది సా
లోచింపఁ దిక్కయజ్వకు
నాచనసోమునకు నింక నాకుం దక్కన్?"


ఇతరరాజులతో పాటు కృతికర్తృత్వమును సొమ్మిచ్చి తనపై వేయించుకొన్న వాఁడే యీ రాజుగూడ నని లోకులనఁ బోవుదు రన్న భయమునఁగాఁబోలు, స్పష్టముగా నీతఁడు-----


"అసహాయసరసకవితా
రసికుఁడ వేంకటధరావరప్రభుఁద, గుణ
ప్రసరప్రకాండమదవ
ధృసలాయితవిద్వదఖిల బంధుప్రజుఁ డన్."


అని చెప్పి కొన్నాఁడు.మఱియు గద్యమున “నిస్సహాయకవితా నిర్మాణభోజ భూదార” అని తనకు విశేషణముఁ జేర్చుకొన్నాఁడు. “నిస్సహాయకవితానిర్మాణ చతురుఁ డానాఁటికి భోజదేవుఁడు, నీనాటకి మరల నేను " అని యీతఁడు గుండె సంచికొని చెప్పుకొన్నాఁ డన్నమాట.