పుట:Telugu merugulu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

99


ఇట్టికసూఁడినవాఁడు

ఉత్తరహరివంశమున నరకాసురున కోడి దిక్పాలురు పారిపోవుటను వర్ణించుటలో యమునిఁ గూర్చి యీ క్రింది పద్య మున్నది.

 “ఇట్టిక సూఁడినవాఁడో
యెట్టిడుకొన్నాఁడొ యనుచు నుల్లసమాడన్
బట్టగుచు మగిడి చూడక
పట్టణమున కేఁగె లజ్జిబండతనమునన్."


పై పద్యమున కనేకు లర్ధము నడిగిరి. లోకాచారము గొంత యెఁగిన వారు గాని దీని యుద్ధము వివరింపఁజాలరు. నరకున కోడిపోయి యముఁడు తనపురమునకుఁ బరుగువాఱు చున్నాఁడు. అట్లు పరుగువాఱుటలో ముందరిచూపే కాని వెనుకచూపు లేదు. అది చూచినవారు “ఈతఁడేమి యిటిక యావమునకు నిప్పంటించి వెళ్లుచున్నాడా? మఱి, వెనుకకుఁదిరిగి చూడనే చూడనని యొట్టుపెట్టుకొని వెళ్లుచున్నాఁడా" అని పరిహాసమాడఁ దగినట్లున్నది. ఇటిక యాపమునకు నిప్పుముట్టించు వారు ముట్టించిననిప్పు అంటుకొన్నదా, లేదా అనియేని వెనుకకుఁదిరిగి చూడకుండ వడిగా ముందుచూపుతోనే వెడలిపోవలెను. అట్లు వెనుకకుఁ దిరిగిచూచిన నా యావము కాల్పు సరిగా సాగక చెడు నని లోకప్రతీతి. ఈ లోకప్రతీతి దెలియకున్న పద్యార్ధ మెఱుకపడదు.

మఱియు నీపద్యము నాల్గవచరణమున 'లజ్ఞబండతనమునన్' అని యున్నది. దీనికి 'లంజెబండతనమునన్' అనియు, 'లంజెబండతనమునన్' అనియు బాఠాంతరము లున్నవి. కవికర్ణరసాయనమునను, గౌరన హరిశ్చంద్ర చరిత్రమునను ఈ పదము ప్రయోగింపబడినది. లబండ సిగ్గుమాళినవాఁడు.