పుట:Telugu bala Satakam PDF File.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

55. దేహసాధనమున దేహమ్ము దృఢమౌను
మంచి పుసకమ్ము లెంచి చూచి
శ్రద్దతోడ చదువ బుద్ధిపదునుదేరు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

56. పుస్తకములు మనకు పూజ్యులౌ గురువులై
జ్ఞానధనము నిచ్చి చక్క బరచు
కోపమేమిలేని గురువులే పొత్తముల్‌
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

57. క్రొత్త ప్రాంతములకు కోరి తీసుకపోవు
పుష్టి కలుగు ఓడ పుస్తకమ్ము
వాయి తెరువనట్టి వక్తయే పొత్తమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

58. తనువు కవసరమ్ము తగినంత భుక్తియే
చిత్త శుద్ధికి తగుచిన్న వాక్కు
హితము గూర్చు చుండు మితమగు పనులెల్ల
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

59. పసడలోన గలుగు 'ప్రతిసన్న' తీగెకు
విలువ ఉండునంచు తెలిసి కొనుము
కణము కణము విలువ కాలానికుండును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

60. మనసు గొప్పదైన మనుజుండు ఘనుడగు
కుత్సితంపు మనసు కూల్చునరుని
కపటబుద్ధి వీడి కదలుట హితమౌను
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


16

తెలుగు బాల శతకం