పుట:Telugu bala Satakam PDF File.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

49. నీతి కదల నెన్నొ నియమమ్ముగానేర్వ
బుద్ధి వికసనమ్ము పొందుచుండు
జ్ఞానధనము మించు సంపదలేదెందు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

50. పలక పట్ట దాగిన ప్రాయమ్మునందున
పార పట్టి గట్టి పనులుచేయు
బాలలుండు దేశ భాగ్యమ్ము నశియించు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

51. పుస్తకాల బరువు మోయగ లేనంత
చేయుచుండు విద్యా చేటు తెచ్చు
గణము కాదు లెక్క గుణములోనుండును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

52. తేనె పట్టుకొట్ట తేనె వెంటనెరాదు
ఈగలన్ని లేచి వేగకుట్టు
పాటులెన్నొ దెచ్చు పరుషమౌ వర్తనల్‌
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

53. జీవసాగరమ్ము శ్రేయంపురీతిలో
దాటవలయునన్న తప్పకుండ
స్నేహ మనెడి నావ నెప్పుడు విడువకు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

54. నిన్ను తిట్టినట్టి నీ శత్రులకెపుడు
భయము పడగ వద్దు బ్రతుకునందు
నిన్ను మెచ్చుహితుల నెప్పుడు కనిపెట్టు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


తెలుగు బాల శతకం
 

15