పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకృష్ణదేవరాయలు 1513లో జైత్రయాత్రలను ముగించుకుని వచ్చిన తరువాత మహర్నవమి దిబ్బను నిర్మించాడు. ఇది ఒక బ్రహ్మాండమైన కట్టడం. ఈ సింహాసన వేదిక మీద రాయలు ఆసీనుడై దసరా వేడుకలను తిలకించేవాడు. ఈ వుత్సవం సెప్టెంబరు నెలలో (ఆశ్వయుజ మాసంలో) తొమ్మిది రోజుల పాటు జరుగుతుండేవి. ప్రభువులు, సామంత రాజులు, దండనాయకులు, రాణివాస స్త్రీలు, దేశంనాలుగు చెరగుల నుంచీ వేలాది ప్రజలు ఈ వేడుకలను చూడడానికి వస్తూవుండే వారని విదేశ యాత్రికుడైన న్యూనిజ్ తెలియ జేస్తున్నాడు.

మహర్నవమి దిబ్బమీద మహానాటకాలు:

విజయనగర వైభవాన్ని దర్శించ వచ్చిన విదేశ యాత్రికులలో ఒకడైన పేయస్ తాను రచించిన వృత్తాంతంలో నాటి నాట్యశాలను గురించి మిక్కిలి ప్రశంసించాడు. నర్తనశాల సుధీర్ఘమైంది. కాని అంత వెడల్పైనది కాదు. దాని ఇరుప్రక్కలా శిల్పరమణీయమైన శిలా స్థంభాలున్నాయట. ఆస్తంభ పలకాలు మీద నాట్యాంతంలో వుండవససిన సరియైన తీరులతో నాట్య కత్తెల రూపాలు చెక్కబడి వున్నాయట. నృత్యం అభ్యసించే వారు నృత్యాంతంలో తాముండవలసిన వైఖరిని మరిచిపోయిన యెడల ఈ శిల చిత్రాలను చూచి దానిని జ్ఞప్తికి తెచ్చుకునేవారట.

ఇంకా నర్తనశాల చివరి భాగంలో వివిధ చిత్రాలతో కూడిన ఒక ఏకాంత స్థలముందట. అక్కడ నృత్యానంతరం అలసట తీర్చుకొనడానికి నాట్యకత్తెలు తమ శరీరాలను, కాళ్ళను చక్కజాపి సడలించు కోవడానికై వ్రేలాడేవారట. శరీరం అన్ని వంపులూ అవలీలగా తిరగటానికి అనువుగా ఇక్కడ అభ్యాసం చేసే వారట.

వేరొక ప్రక్కన ప్రదర్శనాన్ని దర్శించడానికి వచ్చిన రాజు కూర్చునే ప్రదేశంమీదా, నేలమీదా, గోడలమీదా, బంగారు రేకులు తాపబడి ఉన్నాయట. గోడ నడిమి భాగంలో, పన్నేండ్ల బాలిక ప్రమాణం కలిగిన ఒక సువర్ణ విగ్రహం వుందట. ఆ విగ్రహం చేతులు నాట్య కత్తెకు నాట్యాంతంలో వుండవలసిన తీరులో వున్నాయట.