పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విందాలు వసంతాన్ని అతిశయించిన శోభతో వెలుగొందుతున్నాయట. వారు ధరించిన దుస్తులు సొగసుగా వున్నాయట. వారి రూపాలు, క్రొత్తగా వచ్చిన గులాబి పువ్వుల్లాగ, మనసుకు అమితానందాన్ని కలిగించాయట.

వారు రాయల కభిముఖంగా వున్న తెరమరుగున కూర్చుండి వున్నారట. మండపం రంగు రంగుల దీపాలతో చిత్రవిచిత్రంగా నగిషీ చెక్కబడిన చలువరాతి స్తంభాలతో వుందట. దానికి ముందు మిలమిల మెరుస్తూన్న ఒక తెర వుందట. మండపానికి ఎదుట వున్న తొమ్మిదంతస్తుల మేడలోని ఏడవ అంతస్తులో మహారాజు కూర్చొని చూస్తున్నాడట. తెర కదిలి రెండు భాగాలుగా విడిపోయిందట. వెంటనే ఆ సుందరాంగులు అత్మలు ఆనందపరవశమయ్యేటట్లు, లలిత విన్యాసాలతో నృత్యం చేయడం ప్రారంభించారని, ఆ నటుల గాన మాధుర్యం, నటనా సౌందర్యం ఆస్వాదించి చూసి విస్తుపోయారని, ఒడలు మైమఱచినట్లయిందని వివరించాడు.

పగటివేషాలతో పగను సాధించారు:

మొదటి దేవరాయలు (క్రీ.శ. 1406 - 1422) విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రోజులలో పెరిస్తా అనే మహమ్మదీయ చరిత్రకారుడు విజయనగర రాజుల నాటక కళా ప్రాముఖ్యాన్ని, రాజకీయమైన ఒక అపూర్వ సంఘటననూ గురించి గ్రంథస్థం చేశాడు. వివరాలు ఈ క్రింది విధంగా వివరించాడు.

ముగదల్లు రాయచూర్లపై ఆధిపత్యాన్ని గురించి అనాదినుంచీ విజయనగర రాజులకు, మహమ్మదీయులకు తీవ్రయుద్ధాలు జరుగుతూ వుండేవి. విజయనగర రాజులకు కళలపట్ల గల కాంక్షను ఆసరాగా తీసుకుని మహమ్మదీయులు ఒక చక్కని ఉపాయం అలోచించారు.

TeluguVariJanapadaKalarupalu.djvu

విజయనగరం వారి నాటకాలలో నటించే వేశ్యల్ని లోబరుచుకుని, ఆ వేషాలు తామే ధరించుకుని కోటలో ప్రవేశించారు. నాటక ప్రదర్శనంలో ఒక సన్నివేశంలో కత్తియుద్ధం కూడ వుందట. తరుణం వచ్చిన వెంటనే ఈ వేషధారులు బూటకపు నటనకు స్వస్తి చెప్పి ప్రత్యక్ష హత్యాకాండకు వుపక్రమించి ప్రేక్షకులుగా కూర్చున్న రాజకుంటుంబాన్ని వధించి కోటను వశపరుచు కున్నారట.