పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈయన ఆస్థానకవిగా వుండి కాశీఖండం, భీమఖండం, శృంగార నైషధం, హరవిలాసం మొదలైన శృంగార కావ్యాలను రచించిన మహా కవి. విజయనగర ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో వున్న గౌడడిండిమ భట్టు నోడించి, కంచు ఢక్కను పగుల గొట్టించిన ఉద్ధండుడు. నానారాజ సందర్శనం చేసి ఆనాటి సమాజంలో వున్న సాంఘికాచారాలను, ప్రజల జీవిత విధానాలను, లలిత కళా వికాసాన్ని, కళ్ళకు కట్టినట్లు తన గ్రంథాల ద్వారా తెలియజేశాడు. నలగామ రాజు దర్బారులో జరిగిన సంగీత నృత్య వాద్యాది విశేషాలను పల్నాటి చరిత్రలో పేర్కొన్నాడు. 14వ శతాబ్దపు చివర నుంచీ 15 వ శతాబ్దపు ప్రారంభంలోనూ యక్షగానాలను గురించి వర్ణిస్తూ భీమ ఖండంలో "కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి" అని యక్షగానాలను గురించి పొతిడాడు. అంతే గాక, ఒక వేశ్య వేషం ధరించి ద్రాక్షారామ వీథుల్లో భిక్షాటన చేసినట్లు శ్రీ భీమేశ్వర పురాణంలో..

సాని ఈశానియై మహోత్సవమునందు - గల నవచంద్రకాంతంపు గిన్నె పూని
వీథి భిక్షాటన మొనర్చు వేళ జేయు మరులు నృత్యంబు జగముల మరుల గొలుపు.

అని వివరించాడు.

జాదర గీతాలు:

శ్రీనాథుని కాలంలో భోగము వారు కనక వీణలను మీటుతూ, భీమనాథుని గూర్చి 'జాదర జాదర' అనే పల్లవితో మృదువుగా పాడే వారని వర్ణించాడు. ఇది వెన్నెల రాత్రుల్లో మరీ ఆహ్లాదంగా వున్నట్లు భీమ ఖండంలో వివరించాడు.

జాదరజాదరంచు మృదుచర్చరిగీతలు వారుణీ రసా
స్వాదమదాతిరేకముల చంద్రిక కాయగ దక్షవాటికా
వేదుల మీదటన్ కనక వీనలు మీటుచు పాడి రచ్చరల్
మోద మొలర్పగా భువన మోహన విగ్రహభీమనాథునిన్.