Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లకుమల చిహ్నంగా వెలుగొందుతూ వుంది. ఆనందకేళీ విలాసాలతో ఆ ప్రేయసీ ప్రియులు ఎరువురూ ఏకకాలంలో అనంత కాలగర్బంలో కలిసిపోయారు.

ఈ విధంగా కొండవీటి సామ్రాజ్యంలో నాట్యకళా సరస్వతి దేదీప్య మానంగా వెలుగొందింది.

ఇంచు మించు రెడ్డి రాజన్యులందరూ కూడ గొప్ప విద్యాంసులు. సకల కళాభిజ్ఞులు ,కవి, పండిత పోషకులు, వారిలో కొందరు సంగీత సాహిత్యాలలో అపారమైన ప్రజ్ఞకలవారు.

రాజమహేంద్రవరాన్ని ఏలిన అల్లయ వీరభద్రారెడ్డి సంగీత, సాహిత్య విద్యలతో సర్వజ్ఞతను సంపాదించినవాడు.

శివలింగారెడ్డి నాట్య శాస్త్ర పారంగతుడు. మల్లారెడ్డి పౌత్రుడైన శ్రీగిరి రెడ్డి గొప్ప కళా విమర్శకుడే కాక సంగీత సాహిత్యాలలో ప్రవీణుడు.

కొండవీటిని వర్ణించిన శ్రీనాథకవి:

రెడ్డిరాజుల యుగంలో వర్థిల్లిన శ్రీనాథమహాకవి పర రాజుల్ని దర్శించి నప్పుడు కొండవీడు మహా వైభవాన్ని గురించి ఈ విధంగా వర్ణించాడు.

పరరాజ్య పరదుర్గ పర వైభవశ్రీల గొనకొని విడనాడు కొండవీడు
పరిసంధి రాజన్యబలముల బంధించు గురుతైన యురిత్రాడు కొండవీడు
ముగురును రాజులకు మోహంబు బుట్టించు కొమరుమించిన వీడి కొండ వీడు
చటుల విక్రమకళాసాహసం బొనరించు కుటిలారులకు గాడు కొండ వీడు
జవన ఘోటక సామంత సరసవీర భట, నటానేక, హాటా ప్రకట గంధ
సింధురార్భటిమోహన శ్రీల చరవ కూర్మి నమరావతికి జోడు కొండవీడు.

ప్రజ్ఞానాథుడు శ్రీనాథుడు:

శ్రీనాథుడు 1385-1475 మధ్య జీవించిన మహాకవి. ఆయన జీవితంలో చాల భాగం కొండవీడు, రాజమహేంద్రవర రెడ్డి రాజుల వద్దనే గడిచిపోయింది.