పౌరాణిక సంబంధమైన కళారూపాలలో భాగవత కాలజ్ఞాని, గమకి, కీర్తనకార, ప్రవచనకార, జంగమ, గొరవ, గొండలిగ, కథగార, హాస్యగార, నకలినట్టువ, బహురూపి, హగలు వేష ఆట. అంటే మన పగటి వేషాల మాదిరి. అలాగే కొలిబసవ (గంగిరెద్దాట), మారమ్మ, దాసరాట మొదలైన వన్నీ మన తెలుగుదేశంలో వున్నట్లే వున్నాయి.
కేరళ
కేరళలో ప్రసిద్ధి గాంచిన నృత్యాలలో కథకళి చాల ముఖ్యమైంది. దానిని శాస్త్రీయ నృత్యంగానే బావిస్తారు. అలాగే పూజా సమయంలో 'పులయనులు ' పూనకం అనే నృత్యాన్నీ, ఓనం పండుగ సమయంలో 'కై కొత్త కళి ' అన్న నృత్యాన్ని, కుమ్మి నృత్యాన్ని చేస్తారు. తెలుగు దేశంలో వున్నట్టే ఇక్కడ కూడ తోలుబొమ్మలాటలు, కోలాటం, హరికథ మొదలైన కళారూపాలున్నాయి. అలాగే పాలఘాట్ అడవులలో గిరిజనులు చేసే 'ఎవేలకరడి ' అనే వేట నృత్యముంది. మలబారు ప్రాంతంలో కఱ్ఱ ముక్కలు పట్టుకుని చేసే 'మొప్లాహ్కళి' వీరనృత్య ముంది. అలాగే మహాభారత యుద్ధ గాథలకు సంబంధించిన 'వెలక్కలి' వీర నృత్యముంది. కేరళలో అందరినీ ఆకర్షించే పడవ పందాలు వున్నాయి. పందాలు అయిన తరువాత పల్లెల్లో యువతులు 'అట్టపూ' అనే నృత్యం చేస్తారు.
తమిళనాడు
తమిళనాడులో శాస్త్రీయ నృత్యంగా భరతనాట్యం అధిక ప్రాముఖ్యం వహిస్తూ వుంది. అయితే తమిళ ప్రాంతంలో అధిక ప్రచారంలో వున్న నృత్యం తెరుకూత్తు. ఇది సంగీత ప్రధానమైన జానపద బయలు నాటకం. ద్రౌపదీ హరణం ప్రధాన ఇతి వృత్తం. ముఖ్యంగా దేవాలయాలలో దీనిని ప్రదర్శిస్తారు.
అలాగే 'కొరవంజీ' కీలు గుఱ్ఱాల ఆట వుంది. అలంకరించిన ఇత్తడి బిందెను నెత్తి మీద పెట్టుకుని చేసే చిందు నృత్యం కన్నుల పండువుగా వుంటుంది. అలాగే కోలాటం, కుమ్మి, గరగ మొదలైన స్త్రీలు చేసే నృత్యాలు అధిక ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాయి. ఇవి ఆంధ్రదేశంలో కూడా ప్రచారంలో వున్నాయి.
మహారాష్ట్ర
ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరే మహారాష్ట్రంలో తోలుబొమ్మలాటలు, యక్షగానం, హరికథ వున్నాయి. మహారాష్ట్ర ప్రజలు చూచి ఆనందించే జానపద నాట్యం.