పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/809

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాలి, అన్ని సాంస్కృతిక సంస్థలూ, ప్రజానాట్యమండలి తరువాత వచ్చినవే. అందరూ ప్రజానాట్యమండలి బాటలోనే నడుస్తున్నారు. ప్రజానాట్యమండలి వారసులే వారు. ఏ ప్రజల కోసం వారు పని చేస్తున్నారో వారినందరినీ నేను అభినందిస్తున్నాను. అందరూ ఆత్మ విమర్శ చేసుకుని ముందుకు నడవాలనదే నా కోరిక.

మాతృ సంస్థ ప్రజానాట్యమండలి:

ప్రజా నాట్యమండలి కళారూపాలను కొన్ని లక్షల మంది చూశారు. ఆనాటి తెలుగు జాతీయ జీవితంలో ప్రజానాట్య మండలి ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. అట్టడుగున పడి పోయిన ప్రాచీన కళారూపాలన్నిటినీ సంస్కరించింది. ఆంధ్ర సాంస్కృతికోద్యమంలో మహా విప్లవాన్ని తీసుకు వచ్చింది.

ప్రజానాట్య మండలి దోపిడిదారుల్నీ, సంఘవిద్రోహుల్నీ సంఘంలో వున్న కుళ్లునూ, కళారూపాల ద్వారా, పాటల ద్వారా, నాటకాల ద్వారా కడిగి వేసింది. ఈ విధంగా అనతికాలంలోనే నూతన చైతన్యం కలిగించింది.

ప్రజానాట్యమండలి ఉద్యమం మహత్తరమైంది. దాని ఆశయాలు గొప్పవి. దాని పోషకులు ప్రజలు, ప్రజానాట్య మండలి ఆశయాలనూ, సాంప్రదాయాలనూ దేశంలో అనేక అభ్యుదయ నాటక సంస్థలు అనుసరించాయి.అభ్యుదయ నాటక సమాజాల పేర్లతో ప్రజానాట్యమండలి ఉద్యమం కొత్త రూపు తీసుకుంది. ఆనాటికీ ఈనాటికీ ప్రజానాట్యమండలి అజేయమైంది.

నలభై అయుదు సంవత్సరాల క్రితం స్థాపించిన బడిన ప్రజానాట్యమండలి ఉద్యమం ... తెలంగాణా పోరాటంలో పని చేసింది. ప్రజానాట్య మండలి కళాకారులు నాటి కాంగ్రెసు ప్రభుత్వ దారుణ హింసా కాండకు గురైనారు. డా॥ రాజా రావు లాంటి ఉద్యమ నిర్మాతలు ఎందరో అమరులైనారు. వారి పేర్లన్నీ ఇక్కడ ప్రస్తావించడానికి అవకాశం లేక పోయింది. కావాలని ఈ కళాకారుణ్ణీ విస్మరించ లేదు. అందరూ మహానుభావులే అందరికీ వందనాలు.