పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/796

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఆనాడు కృష్ణా జిల్లా గండిగుంటలో రాజకీయాలతో పాటు వైజ్ఞానిక శిక్షణా శిభిరం ప్రారంభమైంది. బందరు కాలేజీలో చదువుతూ కాలేజీ ఫ్యాన్సీ డ్రస్సుల్లో తన ప్రతిభా విశేషాలను ఆనాడే వెల్లడించుకున్న కోగంటి గోపాలకృష్ణయ్యగారు స్వాతంత్ర భావాలను ప్రబోధిస్తూ బుర్రకథను వ్రాశారు. అంటే అంతకు ముందు బాలనాగమ్మ, కామమ్మ, లక్ష్మమ్మ, బొబ్బిలి యుద్ధం మొదలైన బుర్రకథల స్థానంలో స్వాత్రంత్ర్య ప్రబోధం కోసం తొలిగా వ్రాసిన బుర్రకథ ఇది. ముగ్గురు యువకులు కలిసి స్వాతంత్ర్య పోరాటాన్ని చిత్రించే ఈ బుర్రకథ ప్రజలను వుఱ్ఱూత లూగించింది. ఆ కథా రచనకూ, ప్రదర్శనకూ వైజ్ఞానిక వుద్యమానికీ, ప్రజానాట్యమండలి అవిర్భావానికి ప్రథమంగా కోగంటి ప్రముఖ బాధ్యతలు నిర్వహించారు.

కోగంటి కోయ వేషం:

భద్రాచలం ప్రాంతాలనుండి వచ్చే కోయవేషం గురించి అందరికీ తెలిసిందే. ఆ వేషం ద్వారా కోయవేషాన్ని ధరించి కోయభాషలో యుద్ధ బీభత్సాన్ని గూర్చి 1943 మే న బొంబాయిలో జరిగిన కమ్యూనిష్టు పార్టీ అభ్యుదయ రచయితల మహాసభలో వివరించాడు. ఉదాహరణకు ఆ సభలో వున్న డాంగేనీ, బలారాజ్ సహానీనీ చూచి ఓ సామి ఏం? ఈత పిక్కలా బక్కచిక్కి పోయుండావు. నాను ఒక్క ఏరు ముక్క కట్టినానంటే ఇంతలావై పోతావు. నా ఏరు ముక్కంటే ఏమనుకున్నారు హిట్లరూ, గిట్లరూ ఎగిరి సావాల. ముస్సోలీనీ గిస్సోలినీ తుస్సుమని పోవాల. తిండి దొంగలూ, లంచ గొండులూ ఎగిరి పోవాల అంటూ అందర్నీ కడువుబ్బ నవ్విస్తూ అందర్నీ ఆనంద సాగరంలో ముంచి వేశారు. ఇలా మన పాత కళారూపాన్ని ఈ విధంగా మలుపు త్రిప్పి, కళా రూపాల ప్రగతిశీల దృక్పథానికి దోహదం చేశారు.

ఫాసిస్టు వ్వతిరేక శిక్షణా శిభిరాలు:

బొంబాయి వెళ్ళి వచ్చిన దళం కొత్త ఉత్సాహంతో తిరిగి వచ్చింది. 1943 లో కృష్ణా జిల్లా కొడాలిలో ఫాసిస్టు వ్వతిరేక శిక్షణ శిబిరం జరిగింది. ఆ శిబిరంలో రాజకీయాలతో పాటు నూతన దృక్పథంతో జానపద కళారూపాలలో కూడా కళాకారులు శిక్షణ పొందారు. ఈ శిబిరంలో గొల్లసుద్దులు, పకీరువేషాలు, చెంచువేషాలు, సోది, జంతరుపెట్టె, డప్పుపాటలూ, బృందగానాలూ మొదలైనవి శిక్షణ ఇవ్వబడ్డాయి.