వీరిది శైవసాంప్రాదాయం. మైలారలింగస్వామి భక్తులు. వీరు కురుబ జాతికి చెందినవారు. వీరి ఇలవేల్పు వీరభద్రస్వామి. ఇంకా కాకతీయుల కాలంలో కోలాటం, గొండ్లి (గర్భనృత్యం) పేరణి నృత్యం (అంటే కుంభంపై ఎక్కి నృత్యం చేయడం ) వుప్పెన పట్టేలాటలు (అంటే చెఱ్ఱుపట్టీ) గిల్లిదండల ఆట, చిఱ్ఱాగోనె, చిల్లగోడె అనె ఆటలులకూడ ప్రచారంలో వుండేవి. శైవ సాంప్రదాయంలో నందికోల ఆట అనేది వుంది. అది తెలంగాణాలో ఈనాటికి కార్తీక మాసంలో జరుగుతూ వుంది. ఈ నంది కోల ఆటను గురుంచి సోమనాథుడు__
కోలాటమును బాత్ర గొండ్లి పేరణియు - గేళిక జోకయు లీల నటింప.
(బసవపురాణం)
- జాణలు మెచ్చే జాజరపాటలు:
కాకతీయుల కాలంలో ప్రచారంలో వున్న జాజర పాటలను గురించి నాచన సోమయాజి తన వసంత విలాసంలో__
వీణాగానము వెన్నెల తేట - రాణ మీరగా రమణుల పాట
ప్రాణమైన వినబ్రహ్మణవీట - జాణలు మెత్తురు జాజరపాట.
బ్రాహ్మణ వీట జాజరపాట రాణించె వనడాన్ని బట్టి అది ఆనాటి బ్రాహ్మణులలో ఎక్కువ ప్రచారంలో వుందని చెప్పవచ్చు.
ఆ కాలంలో తప్పెట్లు, కాహాళాలు, కొమ్ములు, డమాయీలు, బూరలు, శంఖాలు, సన్నాయులు, డోళ్ళు, చేగంటలు మొదలైన వాద్యాలు ప్రచారంలో వుండేవి.
కాకతీయుల కాలంలో నిర్మాణ శిల్పం, విద్య, చిత్రలేఖనము, చేతి పనులు, కళలుగా వరిగణింపబడ్డాయి. ప్రతి చెంబు మీదా చిత్రాలు చెక్కేవారు. బట్టలపైన అద్దకంతో బొమ్మలను అద్దేవారు. ఇండ్ల గోడలపై చిత్రాలను చిత్రించేవారు. పడుచులు ఇండ్ల ముంగిట ముగ్గులతో రకరకాల చిత్రాలను చిత్రిస్తూ వుండేవారు. ప్రజలు
వారి వారి అభిరుచులను బట్టి , చిత్రపటాలు, వ్రాయించుకునే వారు. వీరపూజ అభిలాష గలవారు, వీరుల చిత్రాలను వ్రాయించుకునే వారు.