Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/732

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్మాగారములందే పదిలక్షల మంది
కార్మికుల జీవితాల విలువ తగ్గి పోయింది
నిరుపేద గణము ఆత్మహత్యలకు గురి అయింది

అని చెపుతూ

తిన తిండి లేక ప్రజలు కష్ట స్థితి కొచ్చారు
న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారు
పోలీసుల దౌర్జన్యంతో ప్రజలను వీరూ
బలవంతముతో నోరు మూయించగలిగారూ.

అని అంటూ 1948 సెప్టెంబరు లో నైజాంలో క్రూర రజాకార్లను అణుస్తామంటూ తెలంగాణా అంతా భారత సైన్యాన్ని దించారు. మత పిశాచంతో కొంతమంది హతమై పోయారనీ, రజాకార్ల నాయకులైన రజ్వీ సయదద్భుల్ రహమాన్ ఇస్మాయిల్ మొదలైన కసాయి వాళ్ళందరూ పాకిస్థాన్ చేరిన తరువాత ఏ కమ్యూనిష్టులైతే రజాకారుల్ని అణచారో ఆ కమ్యూనిస్టుల్ని నెహ్రూ ప్రభుత్వం ఎలా అణచిందీ సుద్దాల హనుమంతు తన విజయ గీతం ద్వారా వివరించాడు.


వినోదభరితమైన విలువిద్యా ప్రదర్శనలు

ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిపోయిన విలువిద్యా ప్రదర్శనలు ఈనాడు మచ్చుకు కూడ కనిపించడంలేదు. ఆదిమ మానవుడు అడవులలో జీవించిన కాలం నుంచీ, ఆయా కాలాల్లో ఆయాజాతుల పరిణామాల్లో, రామాయణ భారత భాగవత కథలలో, జానపద కథలలో ఎక్కడ చూచినా, ధనుర్విద్యా ప్రదర్శనాలుగా పిలువ బడుతున్న విలువిద్యా ప్రదర్శనాలు, నాటి ఆంధ్రదేశంలో అన్ని కళలతోపాటు ఈ ప్రదర్శనలు కూడా ఎంతో ప్రాముఖ్యం వహించాయి.

విలువిద్యలో పురాణ పురుషులు:

పురాణ యుగపు కథానాయకుల నుండీ, ప్రతి నాయకులూ, రాజాధి రాజులు మొదలు, సామాన్య పౌరులూ, అందరూ విలువిద్యను నేర్చిన వారే, అందరికీ నేర్పిన వారే.