- వీర పూజతో వీరుల దినోత్సవం.
పలనాడులో ప్రతి సంవత్సరం కారెంపూడిలో నాగులేటి ఒడ్డున, బాలచంద్రుని గుడివద్ద వీరుల దినోత్సవం జరుగుతుంది. ఈ వుత్సవానికి పలనాడులో నున్న ప్రజలందరూ తిరునాళ్ళలా తరలి వస్తారు. ఈ వుత్సవం దాదాపు ఇరవై రోజులు జరుగుతుంది. ఈ నాటికీ పలనాటి వంశీకులమని చెప్పుకునే వీర విద్యావంతులు ఆ వీరుల్ని, ఆ వీర గాథల్నీ తలచుకుని పులకించిపోతారు. వీరపూజ చేస్తారు. సాంబ్రాణి ధూపంతో వివిధ వాయిద్యాల ధ్వనుల హోరులో పూనకం తెప్పించుకుని గణాచారులై ఉగ్రులై పోతారు. పొరుషంతో వూగిపోతారు. వారి వారసులుగా దుఖిస్తారు. చివరి రోజున పలనాటి యుద్ధానికి కారకులైన నాగమ్మ పాత్రను వేషంగా ధరింపచేసి కారెంపూడి వీధుల్లో వెంటబడి తరుముతారు. అలా ఊరి బయటి వరకూ తరిమి నాగమ్మ శిగను కత్తిరించి నానా తిట్లూ తిట్టి పరాభవిస్తారు. అలా వారికున్న కక్షనంతా తీర్చుకుంటారు.
వీరుల దినోత్సవం జరిగినంత కాలం ఎక్కడెక్కడి వీర విద్యావంతులు, కారెమపూడికి తరలివచ్చి, కారెమపూడిలో కథలు చెపుతారు. నాగావళిలో స్నానం చేసి బాలచంద్రుని గుడి ముందు 'బాలుడో, చెన్నూడో' అంటూ అరుస్తూ వారి వారి మొక్కుబడులు తీర్చు కుంటారు.
వారి వీరావేశాన్నంతా వివిధ వాయిద్యాల ధ్వనులలో వెల్లడిస్తారు. ఆ సమయంలో ప్రతివాడు ఒక వీరుడై పోతాడు. ఉత్సవానికి వచ్చిన ప్రజలందరూ తన్మయులై పోతారు. ఇలా వీర విద్యావంతులు ఈ నాటికి పలనాటిలో కొనసాగిస్తున్నారు.
- వీర విద్యావంతుల వేష ధారణ:
పల్నాటికి చెందిన వీర విద్యావంతులు చెన్నుని దర్శనానికి చెందిన హరిజనులని, పల్నాటి వీరకథాచక్రాన్ని పాడతారనీ ఈ పాడటంలో వీరజోడు (పంబల జోడు) దాని మీద రెండు గంటలు. తిత్తి, తాళం, కత్తి, డాలు ఉపయోగిస్తారని ప్రధాన కథకునితో పాటు ముగ్గురు వంతలు ఉంటారని, ప్రధాన కథకుడు పల్నాటి వీరుడులాగా వేషం వేసుకుంటాడనీ, ఇతడు పన్నెండు బిరుదులు ధరించాడనే విషయం వుందనీ, డా॥ తంగిరాల వెంకటసుబ్బారావు గారు రాష్ట్ర స్థాయి జానపద కళోత్సవాల సంచికలో వివరించారు.