చెరువు నీళ్ళ తగాదాలో వైరుధ్యాలుపెరిగి ...కొండల్రాయుని తండ్రిని చంపిన వారి మీద పగ తీర్చుకోవడానికి యుద్ధానికి సిద్ధమైన పౌరుషవంతుడైన కొండల్రాయుని సాహసోపేతుడైన వీరుని కథనూ, ఈ కోవకే చెందిన సదాసివ రెడ్డి, రాజా రామేశ్వరరావు...గద్వాల సోమానాద్రి కథనూ, చారిత్రక కథలైన, బొబ్బిలి, పల్నాటి యుద్ధానికి సంబంధించిన, వీరరస గాథల్నీ చెపుతారు.
వీరు వరంగల్లు తాలూకాలో వున్న వెంకటరావులపల్లి చుట్టు ప్రక్కల గ్రామాలలో ఎక్కువ మంది వున్నారు. శారద కాండ్రందరూ శైవ మతానికి సంబంధించిన వారే, వీరు మాంసాహారులైన జంగమ జాతికి చెందిన వారనె ప్రతీతి కూడా వుంది. ఎల్లమ్మ ... పోచమ్మ ___ మొదలైన ప్రసిద్ధ దేవతల్ని దైవాలుగా పూజిస్తారు. వీరికి గురువులు జంగాలే. వీరు శైవ మతానికి సంబంధిన వారైనా లింగాలను ధరించరు.
- శారద రామాయణం:
ఇన్నీ చారిత్రిక గాథల్ని వీరరస గాథల్నీ, కరుణరస గాధల్నీ, అద్భుతంగా వాల్మీకి రామాయణాన్ననుసరించి ఒక కవి, పుత్రకామేష్టి నుండి, పాదుకా పట్టాభి షేకం వరకూ, శారద వరుసలకు అనుగుణంగా వ్రాసిన శారద రామాయాణాన్నీ ఎంతోభక్తి శ్రద్ధలతో చెపుతారు...ఇదే కథను, ఆంధ్రదేశంలో పగటి వేషాలు ధరించేవారు. రోజు కొక వేషం చొప్పున రోజుల తరబడి వేషాలు ధరించే పగటి వేషధారులు, శుభ సూచకంగా భక్తి భావంతో, శారద రామాయణాన్ని అలాపించి గ్రామస్తుల వద్ద డబ్బునూ, వస్త్రాలనూ, ధాన్యాన్నీ దానాలుగా సంపాదిస్తారు. అయితే వీరు శారద కాండ్ర వరుసలో ఈ రామాయాణాన్ని చెప్పరు. మూల కథను తీసుకుని క్లుప్తంగా వివరిస్తారు. శారదకాండ్రు ఈ కళా
రూపాన్ని, జోవనోపాధి కోసమే ఉపయోగించుకున్నారు. అయినా ఇదొక చక్కని జానపద బాణీ. రోజు రోజుకీ ఈ కథలకు ఆదరణ తగ్గి పోతూ వుంది.