Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/662

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరనాట్యమే వీరుల కొలుపు

ఆంధ్ర దేశంలో వీరశైవ మతం విరివిగా ప్రచారంలో వున్న రోజుల్లో ఆలయాల్లో శైవమతానికి చెందిన దాసీల నృత్యారాధన చేయటమే కాక, శివభక్తులు తాండవ పద్ధతికి చెందిన వీరావేశాన్ని కలిగించే నాట్యంకూడ చేసేవారని నటరాజ రామకృష్ణ గారు జానపద కళల ప్రత్యేక సంచికలో వివరించారు.

వీరరస ప్రధానలైన రచనలైన ఖడ్గాలను చదువుతూ ఒక చేత ఖడ్గాన్ని, మరొక చేతిలో డాలును ధరించి నాట్యం చేసేవారు. ఈ నాట్యం వీర నాట్యంగా పిలువ బడింది.

వీరు చేసే నర్తనాలన్నిటిలో ఊర్ధ తాండవం అతి ముఖ్యమైంది. ఈ నర్తనాన్ని శివరాత్రి నాడు, రాత్రి పన్నెండు గంటల సమయంలో లింగోద్భవ సమయంలో ప్రదర్శించేవారట. శైవ సంప్రదాయానికి సంబంధించిన అన్ని నృత్యాలలోకి ఈ నృత్యం అతి ముఖ్యమైనదంటారు.

పల్నాటి యుద్ధంలో ప్రాణాలు వదిలిన వీర యోధుల సంస్మరణార్థం వీరుల కొలువులు ప్రారంభమయ్యే ఆరాధన నృత్యాలు కూడ తాండవ పద్ధతికి చెందినట్టివే, కారెంపూడు, గురుజాల, మాచెర్ల మొదలైన పలనాటి ప్రాంతంలో ఈ నర్తనాలు ప్రదర్శింపబడుతూ వున్నాయి.

వీరంగం

వీర నాట్యంలో, వీరణమనే యాయిద్యం వాయించబడుతూ వుంటుంది. అందు వల్లనే ఈ నాట్యానికి వీరంగం అంటారు. ఇందులో ముఖ్యంగా అయిదు అక్షరాల ఖండం ఏకతాళ గతి ఎక్కువగా ప్రదర్శింపబడుతుంది.