Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/625

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బవనీలే బైండ్లవారు

ముఖ్యంగా తెలంగాణా జానపద కళారూపాలలో శైవ మతాన్ని ప్రబోధించేవీ, శక్తి స్వరూపాన్ని ఆరాధించేవి, గ్రామ దేవతల్ని పూజించేవీ ఎన్నో వున్నాయి.

తెలంగాణాలో రేణుకా ఎల్లమ్మ, మూహురమ్మ, పోశమ్మ, బతకమ్మ, మహంహాళీ, అంకమ్మ మొదలైన ఎందరో దేవతలు ఇంటింటా వాడవాడలా వున్నారు. ఆ దేవతల్ని ఎంతగానో పూజిస్తారు.

ఆ దేవతలకు సంబందించిన కథలనీ, గాథల్నీ గ్రామ గ్రామానా ఒగ్గు కథలు చెప్పేవారూ, బైండ్లవారూ, గొల్లసుద్దులు చెప్పేవారూ, ఎందరో కనిపిస్తూ వుంటారు. ఈ నాటికీ ఆ కథలూ, కళారూపాలూ నిలిచి వున్నాయంటే చారిత్రకంగా వాటి ప్రాముఖ్యం ఎటువంటిదో ఊహించవచ్చును.

ఇలా కథలు చెప్పే వారిలో బవనీలనీ, బైనీడివారనీ, బైండ్ల వారనీ రకరకాల పేర్లతో పిలుస్తూ వుంటారు. ఈ బైండ్లవారు హరిజనులైన పూజారులు.

అయితే బవనీలు కాకతీయ చక్రవర్తుల కాలం నాటికే ప్రాముఖ్యం వహించినట్లు క్రీడాభిరామంలో వున్న ఈ క్రింది ఉదాహరణను బట్టి తెలుసుకోవచ్చును. ఈ వుదాహరణను కాకాతీయుల కళావిన్యాసం శీర్షికలో చర్చించిన మాచల్దేవి క్రీడాభిరామ శీర్షికలో ఉదహరించబడిందే. అది ఇది.

బవనీల ప్రసక్తి:

వాద్యవైఖరి కడు నెరవాది యనగ
ఏక వీరామహాదేవి ఎదుట నిల్చి
పరశురాముని కథ లెల్ల ప్రౌఢి పాడె
చారుతర కీర్తి బవనీల చక్రవర్తి.