పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/606

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేచేది, అయ్యగారికి దండం పెట్టమంటే నమ్రతతో తలవంచేది. అయ్యగారికి శుభం కలుగుతుందా? అనుకున్న పనులు జరుగుతాయా అంటే అవునన్నట్టు తల వూపుతుంది. వాడు అడిగిన ప్రతిదానికీ తల వూపడాన్ని బట్టే ఒక సామెత పుట్టిందనుకుంటా.

మనవాళ్ళు అంటూ వుంటారు. ఏమిటిరా అడిగిన ప్రతిదానికీ గంగిరెద్దులా తల వూపుతావు. నోటితో సమాధానం చెప్పరా అని. అది ఏనాడో పుట్టిన సామెత.

రామ లక్ష్మణులు:

ఈ ఎద్దులను రామ లక్ష్మణులుగా ఎంచి పేర్లు పెట్టి పిలుస్తారు. వాటిని బసవేశ్వరుడుగా పిలుస్తారు. రాముడుగా సీతగా ఎంచి కళ్యాణం జరుపుతారు. ప్రేక్షకులు కూడ వాటిని రామలక్ష్మణులుగా ఎంచి భక్తి భావంతో వాటికి ధాన్యాన్ని తినిపించడం, అరటి పళ్ళు పెట్టటం చేస్తారు. ఇలా గంటన్నర కాలం కనువిందుగా ప్రదర్శనం జరుగు తుంది.

గంగిరెద్దుల విన్యాసంలో మధ్య మధ్య పాటలు పాడతారు. వాయిద్యాలకు తగినట్లు వాళ్ళ పిల్లలతో మొగ్గలు వేయిస్తారు. మధ్య మధ్య ప్రేక్షకులను చూచి సమయానుకూలంగా ఛలోక్తులను విసురుతారు.

అలాగే ప్రదర్శనం చూచి ముగ్ధులైన ప్రేక్షకుల నుంచి విరాళాలను దండుకుంటారు. బసవన్నా ఈ బాబు నీకు పది రూపాయలిస్తున్నారంటే అక్కడికికి పరుగెత్తుకొస్తుంది. రామన్నా ఈ బాబు నీ వీపుమీద కండువా కప్పుతానంటున్నాడు ఇలా పేరు పేరునా పిలిచి ప్రేక్షకులను మోమోట పెట్టి విరాళాలు గుంజుతారు.

తరువాత ఇంటింటికీ తిరిగి ధాన్యము బట్టలూ, డబ్బులూ ఎద్దులకు మేతా సంపాదించుకుంటారు. ఇలా ఎద్దులను బ్రతికిస్తూ తద్వారా వారు బ్రతుకుతూ దేశ సంచారం చేసేవారు. ఎద్దుల్లో ఏదైనా ఎద్దు చనిపోతే వారి బిడ్డల్లో ఒక బిడ్డ పోయినట్లుగా భావించి దానికి పూజలన్నీ జరిపించి భక్తిభావంతో ఖననం చేస్తారు.

అయితే ఈ నాడు వీరి గంగిరెద్దుల విద్యక్షీణించి పోయి సామూహిక ప్రదర్శనాలు నశించి కేవలం పొట్ట పోసుకోవడానికి ఒక ఎద్దుతో వూరూరా, ఇల్లిల్లూ తిరుగు తున్నారు. ఇలా కాల ప్రవాహంలో సామూహిక గంగి రెద్దాటలు నశించి పోయాయి.