Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/560

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్మాక్షికి వివాహంలో వత్తి కంకణం కడతాడు. ఆమెకు భూములను, పశువులను ఇస్తాడు. రత్నాంగికి ఉన్ని కంకణం కడతారు. ఆమెకు గొఱ్ఱెలను ఇస్తాడు. పద్మాక్షి సంతానం కురుమల లోని వత్తి కంకణం గోత్రం వారు గానూ, రత్నాంగి సంతానం, ఉన్ని కంకణం గోత్రంవారు గాను ఒప్పుకుంటున్నారు.

కురుమల కథ:

మల్లన్న బీరప్ప కథలను కురుమలు చెప్పుకుంటారు. అవే ఒగ్గు కథలు. ఈ కురమలనే బగ్గు వాళ్ళు, ఒగ్గోళ్ళు అనే పేర్లు. ప్రస్తుతం వీరు ఆ రెండు కథలనే కాక ఇతర కథలను కూడ చెపుతున్నారు. ముఖ్యంగా మల్లన్న కథను కురుమల వివాహ సందర్భాలలో చెపుతూ వుంటారు. ఈ కథలను చెప్పే కురుమలే ఆ కులంలో పురోహితులు. మల్లన్న కథను చెప్పిన తరువాతే కురుమ వధూవరులకు వివాహం జరిపిస్తారు. వీరికి కూడ గ్రామాలు, తాలూకాలు హద్దులుండేవట. ఒకరి హద్దులోకి మరొకరు వచ్చి వివాహాలు చేయకూడదట. పురోహితుడు కూడ ఇతర సమయాల్లో కథలు చెప్పకూడదట. దీన్ని అతిక్రమిస్తే కులబహిష్కారం వుంటుందట. చుక్కా సత్తెయ్య అనే నేటి ప్రసిద్ధ ఒగ్గు కథకుడు ఒకప్పుడు బహిష్కార శిక్షకు గురయ్యాడని చెపుతారు. అతను ఈ కథను కళారూపంగా ప్రచారంలోకి తెచ్చి ధనాన్ని, పేరు ప్రఖ్యాతుల్నీ సంపాదించిన తరువాత కురుమ కులగురువులు అతనినే ఆశ్రయించి, అతని మార్గంలోనే కుల హద్దుల్ని పాటించ కుండా ఈ కథలను చెపుకున్నారనీ, అలా ఈ ఒగ్గు కథ ఒక కళారూపంగా రూపు దిద్దుకున్నదనీ బిట్టు వెంకటేశ్వర్లుగారు అంటున్నారు.

చుక్క సత్తయ్య:

ఈ నాడు ఒగ్గు కథను ప్రతిభావంతంగా చెపుతూ, దాని కొక మన్నననూ, గుర్తింపునూ కలగ జేసి అది ఒక వుత్తమ జానపద కళారూపమని నిరూపించిన వారు వరంగల్ జిల్లా జనగామ వాస్తవ్యులు చుక్క సత్తయ్య గారు. ఆయన ఒగ్గు కథను గురించి ఈ విధంగా వివరిస్తున్నారు.

మావృత్తి కథ వీరభద్రుని గూర్చీ. ఆ తరువాత మల్లిఖార్జున, రేణుకా ఎల్లమ్మ, ఆట్కరన్ కథ, హరిశ్చంద్ర, మహందాత మొదలైనవే గాక చారిత్ర గాథలకు సంబందించిన ఇరవై ముప్ఫై కథల వరకూ చెప్పగలమంటారాయన.