పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/559

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కథనుబట్టి కళారూపం పేరు:

ఈ కథా గాన కళారూపాల పేర్లు ఆ కథలను చెప్పే వారి కులాలను బట్టీ, కథ చెప్పే సమయంలో ఉపయోగించే సహకార వాద్యాలను బట్టీ, కథా వస్తువును బట్టీ వచ్చాయి.

సహకార వాయిద్యం అధారంగా పేరును సంతరించుకున్న కళా రూపాలు పంబ కథ, జముకుల కథ, బుర్ర కథ, ఒగ్గు కథ, ఇక తెగలను బట్టి పేర్లు వచ్చిన కళారూపాలు జంగం కథ, పిచ్చు కుంటుల కథ, గొల్ల సుద్దులు మొదలైనవి. కథా వస్తువును బట్టి వ్వవాహృతమౌతున్న కళారూపాలు హరి కథ, పాండవుల కథ, రేణుకా కథ మొదలైనవి.

భిన్న విభిన్న మైన కథాగాన కళా రూపాలలో ఒగ్గు కథ ఒక్క తెలంగాణా ప్రాంతంలో తప్ప మరో ప్రాంతంలో లేదు. అందులోనూ వరంగల్, నల్లగొండ, హైదరాబాదు జిల్లాలలో బహుళ ప్రచారంలో వుంది. ఈ మూడు జిల్లాలలోనూ సుమారు ఏభై ఒగ్గు కథా బృందాలు కథలు చెపుతూ వున్నాయి.

ఒగ్గు:

శైవ సంప్రదాయంలో ఒక వర్గం వారు శివుని డమరుకాన్ని ఒగ్గు అంటారని వీనికే జెగ్గు, జగ్గు అనే పేర్లున్నాయని ఈ ఒగ్గును కథకు వాయిద్యంగా వాడుతూ కథ చెబుతారు కాబట్టి ఈ కథలకు ఒగ్గు కథ అనే పేరు వచ్చిందనీ, ఈ కథలు శైవ మతానికి సంబంధించినవనీ మల్లన్న, బీరప్ప కథలు ప్రారంభంలో చెపుతూ వుండేవారనీ, అదీ కాక కురుమ కులం వారే ఈ కథలు చెప్పేవారనీ, బీరప్ప, మల్లన్నలు వీరి కులదేవతలనీ, డా॥ బిట్టు వెంకటేశ్వర్లుగారు కరీంనగర్ రాష్ట్రీయ జానపద కళోత్సవాల సంచికలో వివరించారు.

తొలి చెమట, మలి చెమట:

శివుని తొలి చెమట బీరప్పగానూ, మలి చెమట మల్లన్న గానూ పుట్టినట్లు కురుమల కథలు చెపుతున్నాయి. బీరప్పను కురుమల కులగురువుగా భావిస్తారు. మల్లన్న సాక్షాత్తు జన్మ నిచ్చిన వాడు. కురుమలకు మరొక కథనం ప్రకారం, ఆదిరెడ్డి నీలమ్మల సప్తమ సంతానం, అతను పద్మాక్షి, రత్నాంగి అనే ఇద్దరిని పెండ్లాడతాడు.