పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/558

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బగ్గు గొల్లల ఒగ్గు కథలు


రాగభావ యుక్తంగా ఒక కథను అల్లడం, చెప్పడం కథాగానం అని వ్వవహరించవచ్చు. ఈ కథాగాన కళా ప్రదర్శనంలో ఒకరు ప్రథాన కథకులు, అయితే ఇద్దరూ ముగ్గురూ లేక అంతకు ఎక్కువ మంది సహా కళాకారులుంటారు ఒగ్గు కథలో.

గానకళారూపాలు:

ఇటువంటి గానకళారూపాలు మన రాష్ట్రంలోనే అనేకం వున్నాయి. జముకుల కథ, గొల్ల సుద్దులు, వీరముష్టి కథ, పిచ్చుకుంటుల కథ, పంబ కథ, మొదలైనవి. ఆంధ్ర దేశంలో వివిధ ప్రదేశాలలో ప్రచారంలో వున్నాయి. కథ చెప్పే తీరులోనూ, సహకార వాయిద్యాలలోనూ, స్వీకరించే కథలలోనూ ఈ కళా రూపాలు భిన్నంగా వుంటాయి. కాని సంగీతం అభినయాలను ఆశ్ర యించడం ఏదో ఒక కథను ఆలంబనం చేసుకోవడం, ఈ కళారూపాల యొక్క సామాన్య లక్షణం. అందుకే ఈ కళారూపాలనన్నింటినీ కలిపి కథా గాన కళ అని నామకరణం చేయవచ్చు. అన్నిటిలోనూ ఛందోబద్ధమైన రచనలతో పాటు అనేక రకాలైన పాటలు చోటు చేసుకున్నాయని కొత్త దేశిపతిరావు గారు నాట్యకళ పత్రికలో ఉదహరించారు.