Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/537

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హస్తినాపుర పట్నం చూడు
పాండవు లేలిన పట్నం చూడు
తాజమహలు చూడర బాబు
ఎర్రకోటను చూడర బాబు................... ॥పైన॥

ఇలా ఆయా ప్రాంతాల విశిష్టతను వివరిస్తూ, కళ్ళకు కట్టినట్లు వినిపిస్తూ చూపిస్తారు. ఇదే కళారూపాన్ని ఆంధ్ర ప్రజా నాట్య మండలి, ప్రాంతాల్లో వున్న దేశ పరిస్థితుల్ని వర్ణిస్తూ ప్రజాకవి కోగంటి గోపాలకృష్ణయ్య గారు ఇలా వ్రాశారు.

లాయరమ్మ లాయరో
లాయంపెట్టి చూడర బాబు
జంతరు పెట్టె చూడర బాబు .....................॥ జిబిజిబిరికి జా॥

ఎంత లాయరు గున్నదో చూడు
భారత దేశపు తీరును చూడు
భరత మాత కష్టాలను చూడు
భోరుభోరున ఏడ్చేను చూడు............. ॥ జిబిజిబిరికి జా॥

నల్లధనంతో సంచుల నింపి
కొల్లగొట్టిన ఘనులను చూడు
ధరలను పెంచిన ధనికుల చూడు
తాతా బిర్లా తరముల నుండి
మోస పోయిన మనుజుల చూడు

ఢిల్లీ పట్నం చూడర బాబు
ఎఱ్ఱకోటను చూడర బాబు
తెల్ల దొరలను చూడర బాబు
గాంధీ తాతను చూడర బాబు
జిన్నా సాబును చూడర బాబు...

అంటూ ఇలా దేశ పరిస్థితుల్ని వర్ణిస్తూ, తిండి దొంగల్నీ, లంచగొండుల్నీ, దుండగుల్నీ, దోపిడి దారుల్నీ బయట పెడుతూ దేశ భక్తిని ప్రబోధిస్తూ, చివరికి దుర్మార్గుల్ని ఇలా దుయ్య బట్టేవారు.