వీరపురుష దత్తుని కాలంలోనే నాగార్జునుని కొండ శిల్పాలన్ని చెక్కబడినాయి. ఇక్ష్వాకు రాజులు లలిత కళలను పోషించిన ఆధారాలు మనకు ఎక్కువ లేవు. కాని శాతవాహనుల కళా సంస్కృతులను చాలవరకూ కాపాడింది వీరే. పల్లవ రాజులు ఆంధ్ర దేశంమీద దండెత్తడంతో ఇక్ష్వాకుల రాజ్యం పతనమైంది. నాగార్జున కొండ, విజయపురి నగరాలను నాశనం చేయడంతో ఆ నగరాల శోభ అంతరించింది. బౌద్ధ బుక్షువు లందరూ తరిమి వేయ బడ్డారు. బౌద్ధ చైత్యాలన్నీ ధ్వంసం చేయబడ్డాయి.
- పల్లవ సంగీతం:
శాతవాహన చక్రవర్తుల క్రింద సామంత రాజులుగా వుండి వీరు తరువాత స్వతంత్రులై పల్లవనాడును అనగా నేటి పలనాడు కేంద్రంగా చేసుకుని దక్షిణాన కంచి వరకు ఆక్రమించు కుని కంచిలో రాజ్యం స్థాపించారు. పల్లవుల రాజ్య పరిపాలనా కాలంలో మొత్తం 21 మంది పల్లవ రాజులు పరిపాలించారు.
వీరిలో మొదటి మహేంద్ర వర్మ క్రీ. శ. 600 నుండి 630 వరకు పరిపాలించాడు. సింహ విష్ణుని మరణానంతరం అతని పుత్రుడు మొదటి మహేంద్ర వర్మ కాంచీ పుర పల్లవ రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఈతడు పల్లవ వంశ పాలకులలో సుప్రసిద్ధుడు, ఇతడు కళాప్రియుడు. శిల్పకళా విద్యావిశారదుడు. సంగీత విద్యలో దిట్ట. అనేక బిరుదులు సంపాదించిన వాడు. రుద్రాచార్యుడనే విఖ్యాత సంగీత విద్వాంసునికి శిష్యుడు. ఈయన ఒక సంగీత గ్రంధాన్ని రచించి కుడిమియామలై అనే చోట శిలాక్షరాలను చెక్కించాడు. ఈయన సంగీతంలో ఎంత ప్రావీణ్యం కలవాడో సాహిత్యంలోనూ అంత గొప్పవాడు.
పల్లవుల తరువాత సాలంకాయనులు పశ్చిమ గోదావరి లోని వేంగిని రాజదానిగా చేసుకుని 300 నుండి 420 వరకు పరిపాలించారు. ఈ కాలంలో వర్థిల్లిన లలితకళా వికాసం ఎటువంటిదో ఎవరికీ తెలియదు.
- విష్ణుకుండినుల సాహిత్య కళాపోషణ:
తరువాత విష్ణుకుండినులు 420 నుంది 630 వరకు, అమరావతిని రాజధానిగా పరిపాలించారు. గుంటూరు జిల్లాలోని వినుకొండ వీరి స్వగ్రామం. వినుకొండకే విష్ణుకుండిన అనే పేరు వచ్చింది. ఈ వంశలో మొత్తం 9 మంది రాజులు పరిపాలించారు.