పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/485

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


TeluguVariJanapadaKalarupalu.djvu

ఆసాదుల ఆరాధనా చిందులు

ఆంధ్ర అరాయల సీమ, తెలంగాణా జిల్లాలలో మాల మాదిగ కులాల వారు విస్తారంగా వున్నారు. మాల కులంలో మాల దాసరులున్నట్లు, మాదిగ కులంలో ఆసాదులనే వారు ఒక తెగకు చెందిన వారు. అయితే రాష్ట్ర వ్వాపితంగా మాల దాసరులు లేనట్లే ఈ ఆసాదులు కూడా రాష్ట్ర వ్యాపితంగా లేరు. ఒక వేళ వున్నా వారి ప్రాముఖ్యం అంతగా కనిపించడం లేదు. ముఖ్యంగా నాగరికత చెందిన సర్కారు ప్రాంతాల్లో ఈ తెగ అంతగా కనిపించడం లేదు. వెనుక బడిన తెలంగాణా, రాయల సీమ ప్రాంతాల్లో మాత్రం ఆసాదులూ, వారి ఆచార వ్వహహారాలూ, కళా ప్రదర్శనలూ జరుగుతూనే వున్నాయి.

ఆసాదులూ, అమ్మవారి జాతర్లు:

ముఖ్యంగా రాయల సీమలో "ఆసాదులనే వారు మాదిక కులంలో ఒక తెగగా ప్రాచుర్యం పొందారు. ఆసాదులంటే మాల మాదిగ కులాలలో పూజారి వర్గానిని చెందిన వారని" ఆరుద్ర గారు అంటున్నారు. ముఖ్యంగా గ్రామాలలో ఒకనాడు విరివిగా జరిగే అమ్మవారి జాతర్ల సందర్భంలో దున్నపోతుల్నీ, మేక పోతుల్నీ, బలి ఇచ్చే ముందు అమ్మవారిని స్త్రోత్రం చేస్తూ మాల ఆసాదులు పాటలు పాడుతూ వుండగా, మాదిగ ఆసాదులు చేడిక వాయిస్తూ వుంటే, మాతంగ కన్యలలో ముఖ్యులైన వారికి పూనకం వస్తుంది. ఆ పూనకంలో అమ్మవారి కోరికలు చెల్లించ లేదంటూ అడ్డమైన తిట్లు తిడతారు. మరికొన్నికోరికలు కోరుతారు. కోపంతో భక్తుల్నికొడతారు. భక్తులు పూనకంలో వున్న అమ్మ వారిని శాంతింప చేస్తారు. పూనకం దిగిన తరువాత అమ్మ వారి మీద పాటలు పాడుతూ ఆవేశంతో చిందు నృత్యం చేస్తారు. మాదిగ ఆసాదులు ముఖ్యంగా ఎల్లమ్మ కథను గానం చేస్తారు.