మరో తెగ 'మంది హెచ్చు వాళ్ళు ' వీరు చెక్క బొమ్మలు పెట్టి, ఆ బొమ్మల్ని అవసరాన్ని బట్టి చూపిస్తూ, కదలిస్తూ, రాగాలు తీస్తూ కథలు చెపుతారు. వారు చెప్పే కథలు పెద్దిరాజు కథ, కాటమరాజు కథ, గొల్లకరివెళ్ళరాజు యుద్ధం చెపుతారని లక్ష్మీకాంత మోహన్ గారు వ్రాస్తున్నారు.
- సుద్దుల కథలు:
సంప్రదాయ బద్ధంగా గొల్లలు చెప్పే సుద్దులు కథల్నీ రాజకీయ ఉద్యమంలో ప్రచార సాధనంగా వుపయోగించారు. అలా ఉపయోగించిన వారిలో ప్రథములు ఆంధ్ర ప్రజా నాట్యమండలి వారు. తెలంగాణా విప్లవాన్ని గురించి, బుర్రకథను రచించిన తిరునగరి రామాంజనేయులు గారు 1952 లో 'రాష్ట్ర వాంఛ' అనే సుద్ధుల కథను, ఆంధ్ర రాష్ట్ర సిద్ధిని కోరుతూ వ్రాయబడిన కథ ఇది. కాటమ రాజు కథల బాణీలో గొల్ల సుద్దులను చక్కగా వర్ణిస్తూ వ్రాయబడింది.
ఈ కథకు మంచి ప్రచారం వచ్చింది. నవయుగ పబ్లిషింగ్ హౌసు వారు దీనిని 1953 లో అచ్చు వేశారు.
అలాగే రామాంజనేయులు గారు "మన్యం విప్లవం" అనే పేరుతో అల్లూరి సీతారామ రాజు కథను కూడ సుద్దుల కథగా రచించారు. ఇది అముద్రితంగా వుండి పోయినా బహుళ ప్రచారం పొందింది.
అలాగే వారణాసి సత్యనారాయణశాస్త్రి గారు 1954 లో సతీ ముసలమ్మ కథను గొల్ల సుద్దుల బాణీలో వ్రాశారు. ఇది కూడ అముద్రితంగానే వుండి పోయింది.