పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/451

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వాయిద్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ వుంటారు. వాయిద్యం చాల ఉద్రేక పూరితంగా వుంటుంది. ఈ డప్పులను వేప చెక్కలతోనూ, చండ్రపు చెక్కలతోనూ చట్రంగా తయారు చేస్తారు. లేగేదూడ చర్మాన్ని ఒక ప్రక్క మూసి నిప్పు సెగ మీద కాసి వాయిస్తే కణకణమని శబ్దం వస్తుంది. ఈడప్పులతో వలయాకారంగా నిలబడి

నీలాలారా, నిమ్మాలారా
నీళ్ళకు పోయే కన్యాలారా
రేపే వైనామాని చెప్పండోయ్
మేలన్నాలారా.॥నీలాలారా॥

కోటా దుమికే, పేటా దుమికే
కోటలో గజ - నిమ్మా దుమికే
నిమ్మా ముల్లూ - రొమ్మూ నాటేనూ
మేలన్నాలారా

శెలవాలిత్తే గడియా కొత్తూనూ,
సద్దీ తిన్న జలది కాడా సాబానాలా బావికాడా.
జోడుంగరాలు - మారచీపోతినే - మామయ్య గారు
శెలవాలిత్తే గడియా కొత్తూనూ.

అంటూ డప్పులను వాయిస్తూ కోలాటం వేస్తారు. మామూలు కోలాటంలో అందరూ చిరుతలు ఉపయోగిస్తే, ఈ కోలాటంలో అందరూ డప్పులను చంకలో ధరిస్తారు. డప్పులు మ్రోగించే పుల్లలతో మధ్య ఒకరికి కొకరు కోలాటం వేస్తూ ఎగిరె ఎగిరి గజ్జెల కాళ్ళతో నృత్యం చేస్తూ అద్భుతంగా కోలాటం వేస్తారు. ఈ కనక తప్పెట్ల వాయిద్యం చాల ఉత్తేజాన్ని కలుగ జేస్తుంది. ఈ వాయిద్యంలో కృష్ణజిల్లా కనుమూరు వాస్తవ్యుడు అమృతయ్య, వుంగుటూరు వాస్తవ్యుడు ఏసు దాసు, వీరిద్దరూ డప్పుల మీద మృదంగం వరుస లన్నింటినీ అద్భుతంగా వాయించి నలబై సంవత్సరాలకు ముందే ప్రదర్శించారు. వీరిరువురూ ఆంధ్ర ప్రజా నాట్య మండలి రాష్ట్ర దళంలో బొంబాయి, అహమ్మదాబాదు, పూనా, షోలాపూర్, మద్రాసు, ఢిల్లీ మొదలైన ప్రాంతాలకు వెళ్ళి దేశభక్తి ప్రబోధాన్ని చేశారు. సామాన్య వరుసలతో ప్రారంభమైన జాన పదుల ఈ డప్పుల వాయిద్యం ఈనాడు ఒక శాస్త్రీయ వాయిద్యంగా రూపొందింది.