Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/445

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
అడవిలో పులి:

మరి కొందరు ఒక రెండెడ్ల బండి మీద కొమ్మలు, ఆకులు, వగైరాలతో అడవిలా అమరుస్తారు. ఆ బండి మీద అడవి మధ్య పులి వేషం పచార్లు చేస్తూ బండి మీద కలియ దిరుగుతూ వుంటుంది. నేల మీద వేటగాడు పులిని కొట్టాలని, తప్పించు కోలాలని పులి, చివరకు దెబ్బతిన్న పులి వేటగాని మీదకు ఉరకబోయినట్లు విలయ తాండవం చేసి చనిపోయి నట్లు నటిస్తారు.

పులి నృత్యానికి హంగుగా వున్న డప్పు వాయిద్య కాండ్రు కాళ్ళకు గజ్జలు కట్టి, పులి నృత్యానికి అనుగుణంగా వెఱ్ఱి ఆవేశంతో నృత్యం చేస్తారు.

బహిరంగ ప్రదేశంలో జరిగే ఈ పులి నృత్య ప్రదర్శనానికి ఊరు ఊరంతా కదలి వస్తారు. ప్రేక్షకుల్ని చూచిన కొద్దీ పులి వేష గాళ్ళు ఉత్తేజంగా అడుగులు వేస్తూ వుంటే ప్రేక్షకుల్లో కొందరు, ఈలలతో చప్పట్లతో, కేకలతో హుషారు చేస్తారు.

పులి వేషధారి అప్పుడప్పుడు చుట్టు మూగి చిన్న పిల్లల్ని భయపెడుతూ వుంటాడు.

పులి వేషధారి నృత్యం చేసేటప్పుడు రెండు చేతుల్లోనూ రెండు నిమ్మకాయలను వుంచుకుంటాడు. బాగా కోపం వచ్చినప్పుడు నిమ్మకాయను కొరికి తన కోపాన్ని తీర్చుకుంటూ, నిమ్మరసం మింగి తన దాహాన్ని, అదుపులో పెట్టుకుంటాడు.

పులి వేషధారి ఎండలో నృత్యం చేసేటప్పుడు తాని వంటికి పూసుకున్న వార్నీషు రంగులు బిర్రున బిగదీస్తాయి. చర్మం మంట పుడుతుంది. ఉపశమనంగా కడవలతో నీళ్ళు పోసుకుని తాపాన్ని పోగొట్టుకుంటాడు. వేషం ధరిస్తే వారం రోజులు అలాగే వుంచుకుంటాడు. ఈ పులి వేషాన్ని మంచి చిత్రకారులు అతి సహజంగా చిత్రీకరిస్తారు.

చివరి రోజున ఇంటింటికీ తిరిగి పారితోషకాలను పొందుతారు. తరువాత కిరసనాయిలుతో, ఆ రంగు వదిలించి స్నానం చేస్తారు. ఈ నృత్యాన్ని ఎవరు పడితే వారు చేయలేరు. బాగా వ్వాయామం చేసి కండలు

తిరిగిన యువకులే పులి వేషాన్ని ధరిస్తారు. ఈ నృత్యంలో అత్యంత ప్రావీణ్యాన్ని చూపించే పులి వేషధారులు విజయనరంలో వుండే వారు. ప్రజలను అలరించి ఆనంద పర్చే కళా రూపాలలో పులి నృత్యం ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు.