Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/446

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోటప్పకొండ ప్రభల విన్యాసం


గుంటూరు జిల్లా నర్సారావు పేటకు దగ్గరగా వున్న కోటప్ప కొండ, శైవక్షేత్రమైన పుణ్య క్షేత్రం. ప్రతి శివరాత్రికీ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. తిరుపతి కొండకు వెళ్ళి మ్రొక్కులు తీర్చుకున్నట్లే ఇక్కడ కూడ వేలాది మంది మ్రొక్కులు తీర్చుకుంటారు. ఎవరికి వారు మ్రొక్కులు తీర్చుకోవడానికి వస్తూ పెద్ద పెద్ద ప్రభలను కట్టి వాటిని ఎంతో అందంగా అలరించి ఒకరిని మించి ఒకరు పోటీలు పడి ఈ ప్రభలను నిర్మిస్తారు.

ముద్దుల ఎద్దుల అలంకారం:

ప్రభల బండ్లకు కావలసిన ఎడ్లను ఎంతో ముద్దుగా పెంచుతారు. అందు కోసం వాటికి మంచి తిండి తయారుచేస్తారు. బిడ్డలను సాకినట్లు సాకుతారు. వాటికి మెడలో మువ్వల పట్టెడ, గంటల పట్టెడ, మూతికి అందమైన శికమార్లు, నడుంకు తోలు బెల్టు, ముఖానికి వ్రేలాడే కుచ్చులు, కొమ్ములకు రంగులు, కాళ్ళకు గజ్జెలు, వీపుమీద రంగు రంగుల గుడ్డలు అలంకరిస్తారు. ప్రభలు బయలుదేరి వస్తూవుంటే ఈ ఎడ్ల సౌందర్యాన్ని చూడడానికి జనం మూగుతారు. ప్రభలు వారి వారి శక్తి కొలది పెద్ద పెద్ద ప్రభలను తీసుకు వస్తారు. ఆ ప్రభలను రంగు రంగుల గుడ్డలతో, రంగుల కాగితాలతో, ఫోటోలతో అలంకరిస్తారు. శక్తి కలవారు జనరేటర్ పెడ్డి ప్రభలకు ఎలెక్ట్రిక్ బల్బులను అమర్చుతారు.