Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/427

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఉత్తేజాన్ని కలిగించే వాయిద్యాలు:

ఇలా మోడీ చేసే వ్వక్తికి వత్తాసుగా నాగ స్వరాలు, డప్పుల వాయిద్యాలతో, అతనిని ఉత్తేజ పర్చి విజయానికి మార్గదర్శకులౌతారు.

చూసేవారి కిది భయంకర పోరాటంలా కనిపిస్తుంది. రెండు మూఠాలకి చెందిన వయసు ముదిరిన పెద్దలు గంభీరమైన వేషంతో తలపాగలు ధరించి, నల్ల కోటు వేసుకుని, అంగ వస్త్రం పైన వేసుకుని గుడారం ముందు ఏదో శక్తి ఆవహించిన వ్వక్తుల్లా కూర్చుంటారు.

వీరు ప్రారంభంలో రూపాయలను సృష్టించడం, తెల్ల కాగితాన్ని రూపాయి నోటుగా మార్చటం, వేపాకులు దూసి తేళ్ళను సృష్టించడం, పొడి ఇసుకను నీళ్ళలో కలిపి తిరిగి పొడి ఇసుకనే తీయటం, తడి బట్టమీద ముడి జొన్నలు జల్లి వాటిని పేలాలు వేగినట్లు చేయటం, పొడి మట్టిని నీళ్ళలో చల్లి దానిని రంగుగా మార్చడం, మండే నిప్పుని మ్రింగటం, నాలుకను కోసినట్లు చూపించటం, ఇలా ఎన్నో కనికట్టు విద్యల్ని ఒకరిని మించి మరొకరు భయంకరంగా చేశేవారు.

మోడీని వృత్తిగా స్వీకరించి బ్రతికేవారు వంశ పారంపర్యంగా ఆ కళను బహుళ ప్రచారం చేశారు. ముఖ్యంగా గ్రామ పెద్దలను, పెద్ద రెడ్లు, ముంసిఫ్ కరణాలు, జమీదారులు, ఊరు పెద్దల ఆమోద ముద్రతో ఈ ప్రదర్శనాలు రసవత్తరంగా జరిగేవి.

మహమ్మదీయుల మోళీ విద్య:

మోళీ విద్యను ఒక్క పాముల జాతివారే ప్రదర్శిస్తారనుకున్నాం. కానీ ఈ విద్యను మహమ్మదీయుల్లో ఒక వర్గం వారు కూడా ఆదరించారు.

మోళీల్లో కేవలం సాహెబులు ప్రదర్శించే మోళీలు పాముల వారి మోళీకి భిన్నంగా వుంటుంది. ఇది మంత్రతంత్రాలతో కూడిన మాయదారి విద్యగా కనిపిస్తుంది.

మాయలు మ్యాజిక్కులు:

వీరు పాముల బుట్టల్లో ప్రథమంగా పాముల్ని చూపించి తరువాత బుట్టల్ని తెరిచి పాముల్లేని ఖాళీ బుట్టల్ని చూపిస్తారు.

అలాగే ఆ ఖాళీ పాముల బుట్టలో ఒక కాగితపు ముక్క వేసి బుట్ట మూసి ఛూ మహంకాళీ అంటూ బుట్టను తెరిస్తే అందులో నుంచి పడగ విప్పిన పాము ప్రత్యక్షమౌతుంది.