పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/420

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సుందరమైన అందాల భజనలు:

అందరూ కలిసి చేసే భజనలు ఎంతో సుందరంగా వుంటాయి. భజన బృందాల నృత్యం ఎంతో కష్టమైనది. వ్యాయామ ప్రదర్శన లాంటిది. అవేశ పరమైనది. మూర్తీ భవించిన భక్తి తన్మయత్వంతో కూడినది. ప్రతి బృందంలోను ఇరవై ముప్పై మంది వరకూ సమ సంఖ్య లోనే వుంటారు. అందరూ లయ తప్పకుండా ఒకే శ్రుతిలో తన్మయులై పాట పాడుతూ గజ్జెలు కట్టిన కాళ్ళతో నృత్యం చేస్తూ వుంటే ప్రేక్షకులందరూ ఆనంద పరవశులై పోతారు.

అలాగే భక్తి భావంతో కొంత మంది ఉపవాస విధానాలతో రాత్రి తెల్లవార్లూ జాగారం చేస్తూ తరంగ నృత్యాలు చేస్తారు. ముఖ్యంగా రామదాసు కీర్తనలూ, ఎడ్ల రామదాసు కీర్తనలూ, తూము నరసింహదాసు, అల్లూరి వెంకటాద్రి స్వామి, నిష్టల ప్రకాశరావు, ఆదిభట్ల నారాయణ దాసు మొదలైన గేయ కర్తల పాటల్ని భజన పరులంతా ఆలపించే వారు. ఈ భజన బృందాలు ఒక్కొక్క గ్రామంలో పోటీలు పడి రెండు బృందాలుగా ఒకరిని మించి మరొకరు గ్రామ పెద్ద బజారులో ఉధృతంగా భజనలు చేస్తారు.

భజనల్లో భక్తి:

భజన పాటల్లో, భగవంతుణ్ణి ప్రార్థించటం, వేడుకోవటం, కష్టాలు చెప్పు కోవటం, కృతజ్ఞతా భావం ప్రకటించడం, స్తుతించటం, శ్లాఘించటం, వర్ణించటం, భక్తి ఆవేశంలో రామదాసులా తిట్టటం __ కోర్కెలు నెరవేరిన భక్తులు ఆయా భజన పాటల్ని, సులభమైన శైలిలో, అందరికీ అర్థమయ్యే భాషలో వినిపిస్తూ