పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆనందపరుస్తుంది. దాని కూత కూడ వినదగిందే. మేఘాలు పట్టినప్పుడూ, చల్లని గాలులు వీచేటప్పుడూ, ఒడలుపొంగి పింఛాన్ని విప్పి మందహాసంతో నాట్యం చేస్తుంది.

మానవుని అనుకరణ:

అదే విధంగా మానవుడు కూడ చేతులతో, నడుముతో, ముఖభావాలతోనే ఆ నృత్యాన్ని చేస్తున్నాడు. ఇది ప్రత్యేకంగా నెమలిని చూసి నేర్చుకొన్నదే. ఇదే జంతువుల అనుకరణ. దీనికే భరతనాట్య ప్రముఖులు మయూర నృత్యం అని నామకరణం చేసారు.

ఈ నృత్యాలు చేయాలంటే ఎంతో శరీరసాధన వుండాలి. ఇలా ఇకదాని కొకటి, అవినాభావసంబంధ మున్నప్పటికీ నృత్యంలో రమ్యత కనబడుతుంది. ఇటువంటి నృత్యాలు, శాస్త్రయుక్తంగాను, భావయుక్తంగాను భరతనాట్యశాస్త్రం తెలిసినవారే చక్కగా చేయగలుగుతారు. వారే గరుడనృత్యం, సింహనృత్యం, మయూర నృత్యం, నాగనృత్యం ఇలాంటివి ఎంతో అద్భుతంగా నటిస్తారు. దీనినే భావయుత నటన అంటారు.

భూత నటన:

ఈ నటన కేవలం దేవతల్ని సంతోషపెట్టటానికి ఏర్పడింది. దుష్టభూతాలను తృప్తి పరచడానికి, అంటువ్యాధుల నిర్మూలన కోసం, వర్షం కోసం, పంటలకోసం, పశువుల కోసం, నాటి నుంచి నేటి వరకు ఈ భూతనటన సాగుతూనే వుంది.

గ్రామాలలో అమ్మవారి జాతర్ల సమయంలో, దేవుళ్ళ ఉత్సవాలలో, స్త్రీలు పురుషులు అందరూ కలిసి ఎంతో చిత్ర విచిత్రంగా ఆటల్లో . పాటల్లో పాల్గొంటారు. ఎంతో తన్మయత్వంతో ఒక నిండు నమ్మకంతో, వుత్సాహ ఉద్రేకాలతో పాత్రల్లో నటిస్తారు. ఇది ఎంతో స్వభావ సిద్ధంగా వుంటుంది. కారణం వాళ్ళు ఒక ఫలితాన్ని ఆశిస్తున్నారు గనుక వారు దానికి అంకితమైపోతారు. వర్షం కురవాలని సామూహిక నృత్యాలు చేస్తారు. వర్షం కురిస్తే వుత్సవాలు జరుపుతారు. ఆ నృత్యంలో ఒక ఆవేశం వుంటుంది. అందువల్లనే దీనిని భూతనటన అన్నారు పెద్దలు. ఈ భూత నటన మానవుని అజ్ఞానదశను సూచిస్తుంది. ఇది ఈనాటికీ వెనుకబడ్డ ప్రాంతాలలో వుంది.

నేర్చుకున్న నటనలు :

భావయుతనటన, భూతనటన మొదలైనవన్నీ అనాగరిక జాతులనుండి, అడవి జాతులనుండి వాళ్ళను అనుకరించి మనం నేర్చుకున్నాం. ఈనాటికీ కొండప్రాంతా