పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళ అనేది ఒక ప్రత్యేక పదార్థం కాదు. ఇది కళ అని కూడ మానవుడికి తెలియదు. కోపం వచ్చినప్పుడు ప్రతి ఒక్క అవయవమూ, కళ్ళూ, ముఖమూ కంపించి పోతాయి. భావాలు ఎంతో గంభీరంగా వుంటాయి, ఆ ఆకారాన్ని ఇతరులు చూసినప్పుడు ఎంతో భీతి కలుగుతుంది. అతనికి తెలియ కుండానే అందులో కళ ఇమిడివుంది. కాని కావాలనుకున్నప్పుడు ఆ కోపం తెప్పించలేడు. నటించక పోవచ్చు. సహజం అతనిలో ఉద్రేకం కలిగినప్పుడే, ఆ భావాన్ని మనం చూడ గలుగుతాం. సంతోషం బాధ, క్రోధం, శత్రుత్వం మానవునికి సహజ గుణాలని పైనే తెలుసుకో గలిగాం. ఈ గుణాలను కళారూపంలో అభివృద్ధి పొందించాలంటే పై వాటినన్నిటికి అవగాహన చేసుకుని జీర్ణం చేసుకున్నప్పుడే అది సాధ్య మవుతుంది.

భావయుతమైన నటన:

ఆదిమ సమాజపు మనుష్యులు జంతు సమానులుగా వుండేవారని తెలుసు కున్నాం. అడవులలో వాళ్ళ నివాసం అవడం వల్ల వారు జంతువుల లాగే నటించే వారు. అరుపులు, నడకలు, కూతలు, పోట్లాటలు, గర్జనలు, జంతు విన్యాసాలు జరిగేవి. ఇవి చూచే మానవుడు భావయుతమైన నటన మెదలు పెట్టాడు.

నాగనృత్యం:

భావాన్ని బట్టి నటన సృష్టిలోనే వుంది. పాము వచ్చింది, పరుగెత్తింది, పడగ విప్పింది, మెలికలు తిరిగింది, కాటువేసింది. ఈ నటనను చూపించాలటే పాము ఆడటం చూడాలి. దాని అభినయం చెయ్యాలి. మనిషి మెలికలు తిరిగి పోవాలి. కాటు తప్ప మనిషి మాదిరి, కండ్ల లోను, ముఖంలోను, అభినయాన్నిచూపించాలి. దీనినే నాగ నృత్యంగా పేర్కొన్నారు.

వెనుకటి రోజుల్లోనే కాక ఈనాటికి మనం అడవులకు వెళ్ళి చూసినట్లయితే జంతు నాట్యాలు ఎన్నో చూడ గలుగుతాం. వాటిలో కూతకు రాజు కోవెల అని ఈ నాటికి చెప్పుకుంటున్నాం. అలాగే నృత్యంలో నెమలి నృత్యం చూడ దగింది. పింఛం విప్పి అది చేసే నృత్యం మనలనెంతో ఆహ్లాద పరుస్తుంది. ఉత్తేజ పరుస్తుంది.