Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సన్మానాలూ, సత్కారాలు:

ఒకే రోజు కథకైతే, ఏదో ఒక పారితోషికాన్ని హరిదాసుకు ముట్ట జెపుతారు. అదే నెలరోజుల కథలు జరిగిన తరువాత హరిదాసు ఇంటింటికీ వెళ్ళి ప్రతివారినీ కలుసు కుంటాడు. నెల రోజుల పాటు మదులకు నెమ్మదిగా హరి కథను విని ముగ్దులైన ప్రజలు భక్తి ప్రవత్తులతో దాసుగారిని గౌరవించి ఎవరికి తోచింది వారు సమర్పిస్తారు. ఇలా హరి దాసు మొత్తంమీద అందరి వద్దా చేరి ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసుకుని సంతృప్తిగా వెళ్ళిపోతాడు. ఈ విధంగా గ్రామ గ్రామాలు తిరిగి హరిదాసులు కార్యక్రమాలిస్తూ వుంటారు. మరి కొందరు ప్రతి సంవత్సరమూ వార్షికంగా ఆయా ప్రదేశాల్లో ఈ కథలు చెపుతూ వుంటారు.

సినిమా, నాటకం అభివృద్ధి కాక పూర్వం గ్రామాల్లో ఇతర జానపద కళారూపాలతో పాటు ఎక్కువ ప్రజాదరణను పొందిన కళారూపాల్లో హరికథ చాల ముఖ్యమైంది. ఏది ఏమైనా అనాటి నుంచి ఈనాటివరకూ శిధిలం కాకుండా నానాటికీ క్రొత్త రూపును సంతరించుకున్న కళారూపం హరికథ.

ఈ హరి కథను అత్యంత ఉత్తమ కళారూపంగా తీర్చి దిద్ది దానికొక గౌరవాన్నీ, విశిష్టతనూ చేకూర్చినవారు ఆదిభట్ల నారాయణ దాసుగారు. ఆయ ఎన్నో హరికథలు రచించారు. ఎంతో మంది ఉద్ధండులైన శిష్య ప్రశిష్యులను తయారు చేశారు.

ఇంటా బయటా ఇంచక్కని పేరు పొందిన ఆదిభట్ల నారాయణదాసు:
ఆటపాటలమేటి ఆదిభట్ల నారాయణదాసు

ఆదిభట్ల నారాయణ దాసు 1864 వ సంవత్సరం శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకాలో సువర్ణ ముఖీతీరంలో వున్న అజ్జాడ గ్రామంలో జన్మించారు. వీరు ద్రావిడ బ్రాహ్మణులు. తల్లి నరసమాంబ. తండ్రి వేంకటచయనులు, చిన్ననాడే తల్లి ద్వారా భాగవతాన్ని విని అధ్యాత్మికత్వాన్ని జీర్ణించుకున్నారు. తండ్రి ద్వారా పాండిత్యాన్నీ, కవిత్వాన్నీ నేర్చుకున్నారు. నారాయణ దాసు గారు స్వయంకృషి వలన సకల విద్యల్నీ అపారజ్ఞానాన్ని సంపాదించారు.