పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/384

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
కట్టుకథలు కావు అచ్చంగా హరికథలే:

హరికథకులు రామాయణం, భారతం, భావతం మొదలైన అధ్యాత్మిక సంబంధమైన కథలను విరివిగా చెపుతూ వుంటారు. సంపూర్ణ రామాయణం, సంపూర్ణ భారతం, భాగవతం మొదలైన కథలు వరుసగా పది హేను రోజులూ, నెలరోజుల వరకూ గూడా సాగుతాయి. పట్టణాలలోనూ గ్రామాల్లోనూ పనుల తరుణం అయ పోయిన తరువాతా, పర్వ దినాలలోనూ ఆంధ్ర దేశపు హరిదాసులు ఈ కథలు చెపుతూ వుంటారు.

హరికథల ప్రాచీనత:

హరికథల స్వరూపం వేద కాలం నాటిదనీ, సర్వజ్ఞులయిన మహర్షులు ఈ హరి కథా శిల్పాన్ని ప్రప్రధమంగా సృష్టించారనీ పండితులు నిర్ణయించారు. బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు భక్తి సూత్రాలను ఉపదేశిస్తూ హరికథా గానం చేస్తూ వుంటాడని ప్రతీతి. వేద విభజన చేసినా, అష్టాదశ పురాణాలను లిఖించినా మనశ్శాంతి పొందనేరని శ్రీ వ్వాసునకి శ్రీ మద్భాగవతం రచించి హరికథామృథాన్ని పంచిపెడుతూ మానవోద్ధరణ గావింపునని నారదుడు ఆదేశించాడు. తరువాత శుకదేవుడు, సౌనకాది మహర్షులు, సూతుడూ హరికథా రూపకమైన భాగవతాన్ని భారతదేశం అంతటా ప్రచారం చేశారని పాతూరి ప్రసన్నంగారు 1965 పిబ్రవరి 'నాట్యకళ ' సంచికలో వివరించారు.

రంగస్థలము, రంగైన ప్రదర్శనం:

హరికథా ప్రదర్శనాలు రాత్రి పూటే జరుగుతూ వుంటాయి. ఇవి ముఖ్యంగా, గణపతి నవరాత్రులు, దశరా, కృష్ణ జయంతి, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి పర్వ దినాలలో విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ ప్రదర్శనానికి ఖర్చు చాల తక్కువ. ఒకేనాటి ప్రదర్శనమైతే, గ్రామం మధ్య పెద్ద బజారులో గాని, విశాలమైన మైదానంలో గాని ఒక చిన్న పందిరి వేసి పందిరిలో ఎత్తైన దిబ్బను గాని, చెక్కలతో చిన్న స్టేజిని నిర్మించి గానీ రెండు ప్రక్కలా కాంతి వంతమైన పెట్రో మాక్సు లైట్లను అమరుస్తారు. ఆరుబైట ప్రేక్షకులు కూర్చుంటారు. అదే కథ ఒక నెల రోజులు చెప్ప వలసి వస్తే ఒక పెద్ద పందిరి వేసి దానిని చక్కగా అలంకరిస్తారు.