Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/381

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇది కూచిపూడి భామకలాపానికి భిన్నమైనది. ప్రాచీన యక్షగాన దరువుల శైలీ, అభినయ విన్యాసమూ వీరి బాణీలో తొణికిస లాడుతూ వుంటాయి. సంగీత ప్రధానమైన భాగవత సంప్రదాయం వీరిది. భామాకలాప విద్యలో బొంతల కోటి జగన్నాధం గారు, శ్రీకాకులం జిల్లాలో చాల ప్రసిద్ధులు.

పైన వివరించిన వారేగాక వెండ్యాల సత్యభామ, చింతా భద్రం, ఎండమూరు చిట్టి, పేరూరి పుష్పావతి, దుగ్గిరాల శ్రీ విరాజితం, గుద్దిరా జగదాంబ, అంబుల వెంకటరత్నం, మొదలైన దేవ దాసీలు, భామాకలాపం లోనూ, గొల్ల కలాపంలోను, దేవదాసీ విద్యలోనూ బహు ప్రసిద్ధులు.

బొబ్బిలి బెబ్బులి జీవరత్నమ్మ:

కీ.శే. శ్రీమతి జీవరత్నమ్మ బొబ్బిలి సంప్రదాయ భరతనాట్య కళావిదురాలు తారతరాలుగా జీవరత్నమ్మ కుటుంబం వారు ఈ కళను పోషిస్తూ బొబ్బిలి సంస్థాన కళాకారులుగా వర్థిల్లారు.

జీవరత్నమ్మ ఒక్క భరత నాట్య సంప్రదాయం లోనే కాక, కర్ణాటక సంగీతం లోను, వీణావాద్యం లోను విశేష పాండిత్యం గల విదుషీమణి, పద వర్ణాలకు, స్వర జతులకు, శబ్ధాలకు, క్షేత్రయ్య పదాలకు, జావళీలకు నృత్త నృత్యాలు కల్పించి అభినయం చేసేది. ఆమె నర్తన రీతి మంచి పాండితీ ప్రతిభ గలిగినట్టిది. అంతే కాక సంస్కృత శ్లోకాలకు, ఒరియాలో పదావళికి, ఉర్దూ, హిందీభాష ల్లోని టుమ్రీ-గజల్ గీతాలకు కూడ అభినయాన్ని కల్పించి ప్రదర్శించేది. 60 సంవత్సరాల వృద్దాప్యంలో కూడ నృత్యాభ్యాసం చేసేది.

ఆమె సంపాదించిన ధనమంతా దాన ధర్మాలకు ఖర్చు చేసింది. అంతిమ దశలో సంగీత నాటక అకాడమీ వారి వృద్ధాప్య పింఛనుతో జీవించింది. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాదులో నటరాజ రామకృష్ణ గారి నృత్యనికేతనంలో బాలికలకు నృత్య శిక్షణ నిచ్చింది. 'నే నీ కళారాధనకు అంకితమయ్యాను. నాజీవితం కళారాధనలోనే గడిపి తరిస్తా ' నని నృత్య నికేతనం చేరినట్లు నట రాజ రామకృష్ణగారు 68 అక్టోబరు 'నాట్య కళ ' సంచికలో వివరించారు. శ్రీమతి జీవరత్నమ్మ 68 ఆగష్టు 22 తారీఖున కీర్తి శేషురాలైంది.