Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆనాటి ఆవిర్భావం

ఆనాడు : అంటే కొన్ని వేల సంవత్సరాలనాడు. భూమి అంతా సూర్యుని వేడితో కాలిపోయి ఆకాశమంతా ప్రచండ స్వరూపంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా నీరు లేదు వాన లేదు. పశువులూ, పక్షులూ మలమల మాడిపోతున్నాయి.

అడవులన్నీ దగ్ధమై పోతున్నాయి. అడవి మనుషుల గుంపులన్నీ తల్లడిల్లి పోతున్నాయి. అడవులు వదలి బయటికి వచ్చారు.

సూర్యుడే భగవానుడు:

సూర్యుని వేడి వాళ్ళను కూడా వెంటాడింది. తాళలేక తల్లడిల్లి పోయారు. సూర్యుని వల్ల భయంతో కూడిన భక్తి భావం ఏర్పడింది. చేతులు జోడించి నమస్కారాలు చేశారు. సూర్యుణ్ణి దైవంగా భావించి ఆరాధించారే కానీ, ఆకలికి తట్టుకోలేక పోయారు. ఈ ఆకలిని ఎలా తీర్చు కోవాలి? ఏమీ పాలుపోలేదు. ఆకాశమంతా మేఘావృతమైన మేఘాలు చల్లని గాలులతో, ఉరుములతో, పిడుగులతో వర్షం కురవనారంభించిది. ఎండతో మండిపోయే గుంపులకు కొంచెం శాంతి లభించింది. భూమి అంతా చల్లబడిపోయింది. అందరి దాహమూ తీరింది. జంతువులూ, పక్షులూ, క్రిమి కీటకాదులూ, శబ్దాలు మొదలుపెట్టాయి. విత్తనాలన్నీ విచ్చుకున్నాయి. దశదిశలా ఆనందం తొణికిసలాడింది. ఇది గుంపులో వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతవరకూ సూర్యుని వేడితో మగ్గిన వారందరూ ఈ వర్షంవల్ల ఓ జలదేవతా, నీవు మాకు మహోపకారం చేశావని వరుణదేవునికి సాగిలపడి మొక్కారు. వేడితో మ్రగ్గిపోయినవారు జలదేవతతో ధన్యులయ్యారు.

పకృతే దేవత :

వర్షం కురవటంతో ఏ ప్రక్క చూసినా కొండవాగులూ, నదీప్రవాహాలూ, మొత్తంగా ప్రవహించి భూమిమీద అక్కడక్కడా సరస్సులు ఏర్పడ్డాయి. పచ్చబడిన భూమి పైరుల్ని పెంచుతోంది. పగిలి విచ్చిన విత్తనాల ద్వారా పండి ఒరిగిన చెట్ల