పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జీర్ణించి పోతున్న ఈ జానపద కళారూపాలను ఎవరు పునరుద్దరించాలి? రాజులు లేరు, జమీందారులు లేరు, పోషకులు లేరు. ఇంతవరకూ ప్రజలే ఆదరిస్తున్నా అవి అంతంత మాత్రమే. ఆ ఆదరణ చాలదు. వారికి ఇళ్ళస్థలాలు లేవు, ఇళ్ళు లేవు. ఒక వూరంటూ కొంతమందికి స్థిరనివాసం లేదు. చివరికి కొంతమందికి ఓటు హక్కు కూడా లేదు.

ఇందుకు ప్రభుత్వ సాంస్కృతిక వ్వవహారాల శాఖ, అకాడమీ పూనుకోవాలి. ఇది వరకు సంగీత, సాహిత్య, నృత్య, నాటక, లలితకళా అకాడమీలను ఏర్పాటు చేసి వాటికీ ఎలా పునరుజ్జీవం కలిగించాయే జానపదకళల పునరుజ్జీవనానికి ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేయాలి. లోగడ అకాడమీలూ ప్రభుత్వమూ ఈ కళపట్ల సవతితల్లి ప్రేమనే చూపించాయి.

జానపద కళల అకాడమీలో నిష్ణాతులైన వారిని, ఆ కళలో పరిచయమున్న వారిని ఆ కళతో సంబంధమున్న కళాకారులకు ఆ అకాడమీలో స్థానం కల్పించాలి.

ముందు ఆంధ్రప్రదేశ్ నాలుగు చెరగులా వున్న జానపద కళారూపాలేమిటి? వాటిలో జీవించి ఉన్న కళారూపాలెన్ని? అందుకు సంబంధించిన కళాకారులు ఎంతమంది వున్నారు? వారి పరిస్థితి ఏమిటి? వారు ప్రదర్శించే కళారూపం, దానికి సంబందించిన సంగీతం, సాహిత్యం, వేష ధారణ మొదలైన వివరాలు సేకరించాలి. కళారూపాల సాహిత్యాన్నీ, పాటలనూ, వాటి బాణీలనూ టేపు రికార్డు చేయాలి. వారి వారి కళారూపాలకు సంబంధించిన వస్తుసామగ్రినంతా భద్రపరచాలి. మిగిలివున్న కళారూపాలను ఫిల్ములుగా తీయాలి. ఉన్న కళాకారులకు గ్రాంటులను, పెన్‌షన్ లనూ ఇచ్చి వారిని పోషించాలి. ఆ అపురూప సంపదను రక్షించుకోవాలి. రాష్ట్రమంతటా బిక్కుబిక్కుమంటున్న కళాకారులను ఆదుకున్ననాడు ఎన్నో కళారూపాలు ఉద్దరింప బడడమే కాక, ఎందరో కళాకారులకు జీవనాధారం ఏర్పడుతుంది.

తిరిగి జానపద కళావికాసం కలుగుతుంది. మన కళారూపాలన్నీ దేదీప్య మానంగా వెలుగొందుతాయి. తరతరాల జానపద కళావైభవం వెల్లివిరుస్తుది.

నేటి ఆధునిక కళారూపాలతో పాటు జానపద కళారూపాలు కూడ నూతన వైభోగం సంతరించుకుంటాయి. నేటి తరాన్ని అలంరించటమే కాక, ముందు తరాల వారికి, చారిత్రిక కళారూపాలుగా నిలబడాయి. జాతి జీవితంలోనూ, అఖిల

భారత స్థాయిలోను చరిత్రాత్మకమైన జానపద కళారూపాలు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతాయి. అందుకే నా యీ చిన్న ప్రయత్నం.