పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/369

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సంగీత సాహిత్య నిధి రావూరి కామయ్య:

సంగీత, సాహిత్య, నాట్య కళానిధి రావూరి కామయ్య గారు. వీరి స్వగ్రామం వెలదుఱ్ఱు. వీరు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. వీరు మారంపల్లి వారి గొల్ల కలాప ఖండ నిర్మాణానికి మూల పురుషులు. వీరి మరణానంతరం శ్రీ వెంకయ్య, సూరయ్య, సత్యం గార్లు మారంపల్లెలో స్థిర పడి పోయి చిత్త జల్లు కళాకారిణులతో చాలకాలం గొల్లకలాప ప్రదర్శనాలను ఇచ్చారు.

కామయ్యగారు హాస్యం చెప్పడంలో నిధి. ఎటువంటి అర్థం కాని విషయాన్నైనా తన హాస్య కళా నిపుణత్వంతో తేటతెల్లం చేసేవారు. భామాకలాపం, గొల్ల కలాపం రెండింటిలోనూ హాస్యానికి పెట్టింది పేరు. ఈయన అటు విశాఖ జిల్లా నుండి ఇటు గుంటూరు వరకూ పేరు ప్రతిష్ఠలను సంపాదించారు.

వీరి సోదరులు వెంకయ్యగారు సంగీతంలో ఆరితేరిన మేధావి. సత్యంగారు సంస్కృతాంధ్ర భాషల్లో మంచి పండితుడు. వీరిరువురూ తమకు కావలసిన అనేక కీర్తనలకు స్వరాలనూ, మట్లనూ, గమకాలనూ తామే తయారు చేసుకునే వారు. ఇక సూరయ్య గారు తమ సంచారంలో తటస్థించిన అనుభవాలన్నిటినీ క్రోడీకరించి సమయాను కూలంగా ప్రేక్షకుల ననుసరించి, సమయా సమయాలు ఆలోచించి, గొల్ల కలాప ప్రదర్శనంలో చేర్చి ప్రజా రంజకంగా ప్రదర్శించేవారు.

ఈ రీతిగా గొల్ల కలాపాలను ఎక్కువ కాలం (దాదాపు 40 సంవత్సరాలు) వెంకటరత్నం సోదరీ మణులు ఆంధ్ర దేశమంతటా ప్రదర్శించి కళాసేవ చేశారు.