పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కామయ్య, కామయ్యగారి సోదరులు సూరయ్య, వెంకయ్య, సత్యం మొదలైన వారంతా మారంపల్లి లోనే వుండి గొల్లకలాప ప్రదర్శనాన్ని గోదావరి మండలం లోనూ, సర్కారు జిల్లాల లోను ప్రదర్శించి పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. ఆంధ్ర దేశంలో కర్ణాటక కచ్చేరీ నాట్యాన్ని భాగవత కళను రెంటినీ ఆరాధించిన దేవదాసీ కుటుంబాల్లో చిత్త జల్లు వారు బహు ప్రసిద్ధులు.

చిత్తాలను జల్లుమనిపించిన చిత్తజల్లు లక్ష్మీ కాంతం:

లక్ష్మీకాంతం మృదుమధురంగా సంగీతం పాడగలిగేది: చక్కగా నృత్యం చేయగలిగేది. సంస్కృత భాషాజ్ఞానాన్ని సంపాదించిన కళాకారిణి. లక్ష్మీ కాంతం ప్రథమంలో కూచిపూడి భామా కలాపాలనే ప్రదర్శిస్తూ వుండేది. తరువాత కామయ్య గారి సహాయం తోనూ, వారి తమ్ముల అండతోనూ గొల్ల కలాపం నేర్చుకుని బహుళ ప్రచారం గావించి, ఆంధ్రదేశంలో గొల్ల కలాపాన్ని వ్వాప్తిలోకి తీసుకు వచ్చి కొంత కాలానికి స్వర్గస్థురాలైంది. ఆమె అనంతరం గొల్ల కలాప ప్రదర్శనాన్ని చేయి విడవకుండా అమె కుమార్తెలు కృష్ణ హరి, చిన వెంకటరత్నం కొనసాగించారు.

వరుస తప్పని వారసత్వం:

లక్ష్మీకాంతం చెల్లెలు వైదేహి. ఈమె పెదవెంకటరత్నం అనే కుమార్తెను కని చిన్న తనంలోనే మరణించింది. లక్ష్మీ కాంతంకుమార్తె అయిన కృష్ణహరి వైదేహి, ఇందువదన అనే ఇరువురు కుమార్తెలను కని, ఆమె కూడా దివంగతు రాలైంది.

అందువల్ల లక్ష్మీకాంతం తన కుమార్తె చిన వెంకటరత్న్ననికి, చెల్లెలి కుమార్తె పెద వెంకటరత్నానికి కామయ్య గారి సోదర బృందం ద్వారా విద్యా బుద్ధులు చెప్పించి గొల్ల కలాప ప్రదర్శనానికి సరియైన తీరికలు తీర్చి దిద్దారు.