- కచ్చేరీ నృత్యకళ:
ఒకే నర్తకి ఏకధాటిగా నృత్యం చేయడం కచ్చేరీ నృతకళ యొక్క ప్రత్యేకత. రాజాస్థానాలలో అభివృద్ధి చెందిన ఈ కళ దేవదాసీలచే ఆరాధింపబడి ఆంధ్ర దేశంలో కచ్చేరీ కళగా రూపొందింది. ఆంధ్రదేశంలో అభివృద్ధి పొందిన కూచి పూడి నాట్యానికి, దీనికీ ఏ విధమైన సంబంధమూ లేదు. ఈ కళను బొబ్బిలి, విజయనగరం, కార్వేటి నగరం, వెంకటగిరి, కాశహస్తి మొదలైన సంస్థానాధి పతులు పోషించారు.
ఆనాటి నాట్య శాస్త్రకారులు నృత్యాన్ని, నృత్తాన్ని, అభినయాలను మేళవించి ఒక నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక నృత్య కళగా కచ్చేరీ నృత్య కళను ప్రచారం లోకి తీసుకవచ్చారు. దేవదాసీలు క్షేత్రయ్య పద సాహిత్యానికి నృత్యాభినయాలను రూపకల్పన చేసి ఈ కచ్చేరీ నృత్య కళను ప్రదర్శించేవారు. ఆస్థానాల పోషణ తగ్గిన అనంతరం, దేవదాసీలు కేవలం వుదర పోషణార్థం దీనిని ఉపయోగించారు. సాత్విక ప్రధానమైన ఈ నృత్య కళ ఈనాడు ఆంధ్ర దేశంలో అక్కడక్కడ వృద్ధ దేవదాసీల సొత్తుగా వుందని నటరాజ రామకృష్ణగారు తెలియ జేస్తున్నారు.
- మారంపల్లి గొల్ల కలాపం:
గొల్లకలాప ప్రదర్శనం ఆంధ్ర దేశంలో నూరు సంవత్సరాల క్రితమే ప్రదర్శింప బడింది. ప్రథమంలో కూచి పూడు భాగవతులు గొల్ల కలాపాన్నే ప్రదర్శించారు. వీరు ప్రదర్శించిన తరువాతే మారంపల్లి చిత్త జల్లువారు కాని, ఆంధ్రదేశంలోని ఇతర కళాకారులు గాని ప్రదర్శించారు. గొల్ల కలాపం తరువాత భామా కలాపం ప్రచారంలోకి వచ్చింది. భామాకలాపాన్ని కూచిపూడి వారు ఆనాటి నుంచీ ఈ నాటి వరకూ ప్రదర్శిస్తూనే వున్నారు.
గొల్లకలాపం మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు తరాలుగా సజీవంగా నిలిచి వుంది. గొల్లకలాపాన్ని పెంచి పెద్ద చేసి పోషించిన వారు నిడుదవోలుకు సమీపాన గల మారంపల్లి వాస్తవ్యులు. కళావంతుల కులానికి చెందిన కీ.శే. చిత్తజల్లు లక్ష్మీకాంతం, రావూరి