Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాచల్దేవి. కుమార గిరి రెడ్డి ఆస్థానంలో లకుమా దేవి మొదలైన వారు రాజ నర్తకి సంప్రదాయానికి చెందిన వారు.

నట్టువ మేళాలు:

కచ్చేరీ నృత్యకళ నుంచి వుద్భవించినవే నట్టువ మేళలు. కచ్చేరీ నృత్య కళ కేవలం రాజ్యాశ్రమ మైనది. ఈ నట్టువ మేళలు అఖిలాంధ్ర ప్రజానీకానికి పరిచయ మైనవి. ఇది వీధి కళా రూపమని చెప్పవచ్చు. వివాహాది వూరేగింపుల్లోను, మేజువాణీలలోనూ, గొప్ప గొప్ప తిరునాళ్ళ లోను, దేవుని కళ్యాణ వుత్సవాలలోనూ ఇవి ప్రదర్శింప బడేవి. పండితులనే కాక పామరుల్ని కూడా రంజింప జేయగల కళారూపమిది. మొరటు హాస్వపు పాటలతో కూడ ప్రేక్షకుల్ని రంజింప చేయడం కద్దు. కచ్చేరీ నృత్య కళకూ, నట్టువ మేళాలకూ అవినాభావ సంబంధంముంది. ఈ రెండు కళలనూ ఆరాధించిన వారు ఎక్కువమంది దేవదాసీలే.

కచ్చేరీ ఆట దేవాలయాల్లో జరిగే టప్పుడు వీరు మేళ ప్రాప్తితో ప్రారంభించి, పుష్పాంజలి, పేరణి, గీతం, శబ్దం, లసాం, జతి, వర్ణం, పదం, జావళి, తిల్లాన లేక దరువుతో ముగిస్తారు. శబ్దం, సలాం, జతుల్లో ఆంతరింగిక ప్రధానమైన ముద్రలు వేశేషంగా ప్రదర్శించే నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఆ తరువాత వర్ణంలో నృత్త నృత్యాలు సమంగా పోషించి సాత్వికాభినయ ప్రాముఖ్యంతో, జావళీలలో ప్రదర్శించి తిల్లాన నృత్యంతో ప్రదర్శనం ముగిస్తారని నటరాజ రామకృష్ణగారు వివరించారు.

కళాకారులకు శిక్షణ:

నట్టువ మేళాలతో నాట్య శాస్త్ర ప్రావీణ్యం తగ్గి పోతూందను కున్న కళాకారు లందరూ కట్టు దిట్టమైన శిక్షణ పొందాల్సి వచ్చింది. భాగవత మేళాల్లో వుండే కళాకారులందరికి సంస్కృతం, తెలుగు వచ్చి వుండాలి. నాట్య శాస్త్రం, నంది కేశ్వరుని అభినయ దర్పణం, భరత రస వ్రకరణం, అలంకార శాస్త్రం క్షుణ్ణంగా అభ్యసించి, నృత్త, నాట్య, అభినయాలలో పూర్తి కళో వికాసాన్ని పొందేవారు. ఇలాంటి శిక్షణతో నటులందరూ తయారయ్యే వారు. ఎవరిని కదిలించినా, అందరూ పండితుల మాదిరే వల్లించేవారు. అందు వల్లనే ఆనాటి ప్రదర్శనాలు అంత కట్టుదిట్టంగానూ, కళా ప్రాశస్త్యంతోను ప్రదర్శించబడ్డాయి.