- వైదేహి, ఇందువదన:
వైదేహి ఇందువదన లిరువూ మరణించే వరకూ గొల్లకలాప ప్రదర్శనాన్ని చెదురు మదురుగా ప్రదర్శిస్తూ వచ్చారు. వైదేహి గొల్లకలాప ప్రదర్శనంలో సిద్ధ హస్తురాలు. ఆమె సోదరి ఇందువదన ప్రయోక్త గా వుండి అక్కగారి చేత నాట్యమాడించేది. ఈ విధంగా వీరుద్దరూ అయిదు దశాబ్దాలు నాట్య కళారాధన చేశారు. వైదేహి పంచ కావ్వాలూ., అమరమూ, వేదమూ పురాణ పండ వెంకట శాస్త్రి గారి వద్ద పకడ్బందీగా చదువుకుంది. అభినయం, సంగీతం, వేదం, స్మృతులు, పురాణాలు, భరత శాస్త్రం, అలంకార శాస్త్రం, రసశాస్త్రమూ పండితుల వద్ద ప్రత్యేకంగా అభ్యసించింది. ఇందువదన చదలవాడ కుమార స్వామి వద్ద సంగీతాన్ని, లయజ్ఞానాన్ని
నేర్చుకుంది. వీరి నాట్యశిక్షణ తెల్లవారు ఝామున ప్రారంభిస్తే రాత్రి పది గంటల వరకూ కొద్ది విరామాలతో అలా అలా నడుస్తూనే వుండేదట. ఈ విధంగా ఈ శిక్షణ పది సంవత్సరాలు జరిగిన తరువాతనే వీరు రంగస్థలంపై కాలికి గజ్జెకట్టి బహిరంగంగా ప్రదర్శనాలు ఇవ్వగలిగారట. వీరు భామాకలాపం, గొల్ల కలాపాలనే గాక, భోగం మేళాలుగా వివాహ సమయాల్లోనూ, దేవాలయ కళ్యాణ మహోత్సవాలలోనూ తమ కార్యక్రమాలు ప్రదర్శించేవారు. ఇందువదన హరికథా కాలక్షేపం కూడా చేసేదట.