2.
జానపద కళారూపాలు
అయితే జానపద కళారూపాలంటే అవి శాస్త్రీయమైనవి కావనీ, అవి కేవలం పామరుల కళారూపాలనీ, పనికిమాలినవనీ, ఏమాత్రం శాస్త్రీయత లేనివనీ కొంతమందిలో దురభిప్రాయముంది. కాని సంగీతానికి, నృత్యానికి, ఎలాంటి శాస్త్రీయత వుందో అలాంటి శాస్త్రీయతే వీటికీ వుంది. జానపద కశారూపాలలో సంగీతముంది. తాళం వుంది, లయ వుంది, నృత్య ముంది, అభినయం వుంది, ఆహార్య ముంది, వాయిద్య ముంది, లయబద్ధమైన కలయికా క్రమశిక్షణ వుంది.
జానపద కళలు అతి ప్రాచీనమైనవి. మానవుల యెక్క అనుభూతులకూ, మానసిక చైతన్యానికి, విజ్ఞాన వినోదాలకూ అనందోత్సాహాలకూ ప్రతీకలై నిలిచాయి. అన్ని కళలకూ పునాదులై అగ్రభాగాన నిలిచాయి.
ఆంధ్రుల సాంఘిక చరిత్ర రెండువేల సంవత్సరాల నాటిది. నాటి నుంచి నేటి వరకు ఆయా రాజుల కాలంలో రకరకాలుగా ఈ జానపద కళలు పోషించబడ్డాయి, ఆచరించబడ్డాయి. అభివృద్ది చెందాయి. శాస్త్రీయ కళలతో పాటు జానపద కళలు కూడ పోషించ బడ్డాయి. ప్రజలు ఆదరించారు.
ఆదిమ కళారూపాల అభివృద్ధి లోనే శాస్త్రీయత ఉద్భవించింది. త్యాగయ్య గారి కృతులకూ, అన్నమయ్య గారి గేయాలకూ, ఎవరు స్వరాలు ఏర్పాటు చేశారు? ఎవరు తాళగతుల్ని ఏర్పరచారు? ఆదిమ జానపద కళలే లేకపోతే, ఈ శాస్త్రీయత ఎక్కడిది? శాస్త్రీయతకు పునాది జానపద కళలే, అయితే ఈ శాస్త్రీయత పేరు మీద జానపద సంగీతాన్ని శాస్త్రీయ సంగీత వాగ్గేయకారులు, జానపద నృత్యకళను, శాస్త్రీయ నృత్యకారులు, అలాగే జానపద సాహిత్యాన్ని, గేయ సాహిత్యాన్ని గ్రాంధిక భాషావాదులు, శాస్త్రీయత చాటున దాగిన ఛాందసులూ, జానపద విజ్ఞానాన్ని అణచివేశారు, సర్వనాశనం చేశారు. వాటికి ఆదరణ లేకుండా చేశారు. ఈనాడు ధనికవర్గాలు బలహీన వర్గాలను ఎలా అణచివేశాయో అలాగే జానపద కళలను కూడ భూస్థాపితం చేశారు. అలా అజ్ఞాతంగా జానపద కళలు ఆదరణ లేక అలా వుండి పోయాయి.
శతాబ్దాలుగా రాజులుపోయినా, రాజ్యాలు మారినా, జానపద కళలు మాత్రం ప్రజాహృదయాలలో అలాగే నిలిచి వున్నాయి. ఎన్ని ఆటుపోటులు వచ్చినా ప్రజలు వాటిని పోషించారు. కళలనూ, కళాకారులనూ, కన్నబిడ్డలుగా చూసుకున్నారు. తెలుగు జాతి గర్వించతగిన కళారూపాలవి.
నాటకం, సినిమా, రేడియో, టెలివిజన్ లాంటి ఆధునిక సాంకేతిక ప్రక్రియలు రావడంతో ఈనాడు వాటివల్ల ఆదరణ తగ్గింది. జానపద కళలను పోషించే