Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనసంపదే
జానపద కళారూపాలు

నాటకరంగానికి మాత్రుకతై యుగయుగాలుగా; తరతరాల వైభవాన్ని సంతరించుకున్న జానపద కళారూపాలను గురించి ఈ తరంవారికి ఎవరికీ తెలియదనటం అతిశయోక్తి కాదు. అది తరతరాల వైభవం, తరగని వైభవం.

మన నాటకరంగానికి నూరేళ్ళు దాటాయి. అలాగే నాటకాలనే వృత్తిగా చేసుకొని బ్రతుకుతున్న సురభి నాటకరంగం ఏర్పడి కూడా నూరు సంవత్సరాలు దాటాయి. ఇటీవలనే చలనచిత్ర పరిశ్రమ స్వర్ణోత్సవాన్ని కూడా జరుపుకుంది. ప్రాచీన కళారూపాలను పునరుద్ధరించి ప్రగతిశీల దృక్పధంతో నూతన ప్రయోగంతో ఆధునిక పద్ధతులలో ప్రజల మధ్యకు పోయి కళారూపాలలో ప్రజాసమస్యలను జోడించి నవ చైతన్యం కలిగించిన ప్రజానాట్యమండలి ఏర్పడి నలభై ఏడు సంవత్సరాలైంది.

అయితే నూరు సంవత్సరాలకు ముందు నాటకరంగం లేనినాడు మన ప్రజలకున్న కళారూపా లేమిటి? అని మనం ప్రశ్నించుకుంటే మనకు కనిపించేవి ఆనాటి జానపద కళారూపాలే.

జానపద కళారూపాలంటే ఈనాడు చాలామందికి అర్థం కావు. జనపదమంటే పల్లెటూరనీ జనపదంలో నివసించేవారు జానపదులనీ, వారు పాడుకునే పాటలుగాని, ఆటలుగాని, నృత్యంగాని, జానపద కళారూపాలనీ పెద్దలు నిర్వచించారు.

జానపద సాహిత్యమనీ, జానపద గేయాలనీ, జానపద నృత్యమనీ, జానపద సంగీతమనీ, జానపద వీధినాటకమనీ, తోలుబొమ్మలనీ, బుర్రకథలనీ, యక్షగానాలనీ, జముకుల కథలనీ, పిచ్చుకుంటుల 'కథ ' లనీ, పగటి వేషాలనీ ఇలా ఎన్నో వందలాది కళారూపాలు ఆనాడు పల్లె ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్నీ కలిగించాయి.